పెట్రో కంపెనీలకు నష్టాలట.! కామెడీ కాకపోతే మరేంటి.?

మీకు తెలుసా.? ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్.. నష్టాల్ని చవిచూస్తున్నాయట. ఆరు నెలల్లో సుమారు 20 వేల కోట్ల రూపాయల మేర నష్టపోయాయట చమురు కంపెనీలు. డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తా.? అన్నట్టుంది పరిస్థితి.
దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్. వంట గ్యాస్ ధర కూడా మండిపోతోంది. సామాన్యుడికేమో ఇలా జేబు చిల్లు పడుతోంటే, పెట్రో కంపెనీలు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నాయట. వాటిని ఆదుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందట. గ్రాంట్ల రూపంలో కేంద్రం, ఆయా పెట్రో కంపెనీలను ఆదుకుంటోందట.

చిన్న విషయం కాదిది.! పెట్రోల్ అలాగే డీజిల్ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తోన్న పన్నులతో సామాన్యుడికి వాచిపోతోంది. వంద రూపాయల పైనే పెట్రో ధర పలుకుతోంది. డీజిల్ ధర వందకు అటూ ఇటూగా వుంది. దేశంలో దాదాపుగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.
అంతర్జాతీయ చమురు ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశంలో పెట్రోధరలు 50 నుంచి 70 రూపాయల మధ్యలోనే వుండాలి. మరి, చమురు కంపెనీలు ఎలా నష్టపోతున్నాయ్.? ఇటు సామాన్యుడూ నష్టపోయి.. అటు పెట్రో కంపెనీలు నష్టపోయి.. మధ్యలో సొమ్ములన్నీ ఏమైపోతున్నట్లు.?

కేంద్రం పన్నుల రూపంలో వాయించేస్తోంటే, రాష్ట్రాలూ తక్కువేం తినడంలేదు. అద్గదీ అసలు సంగతి. చమురు కంపెనీలు సైతం బాగుపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఇటు జనాన్నీ, అటు పెట్రో కంపెనీల్నీ ముంచేస్తున్నాయన్నమాట. పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూని ప్రజల కోసమే కదా ఖర్చు చేస్తున్నాం.? అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదన కావొచ్చు. కానీ, ప్రజల్ని పన్నుల పేరుతో వాయించేస్తూ.. ప్రజల్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పడంలో ఆంతర్యమేంటో.?