ఏపీలో ఇప్పుడు జనసేన ఓటు బ్యాంకు ఎంత.?

2019 ఎన్నికల్లో పది శాతం ఓటు బ్యాంకు కూడా సంపాదించుకోలేకపోయింది జనసేన పార్టీ. గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా మెగాస్టార్ చిరంజీవి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగారు. కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.. కనీసం పది శాతం ఓటు బ్యాంకుని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధించలేకపోయారు పవన్ కళ్యాణ్. చిరంజీవే కాస్త నయ్యం.. ఆయన పాలకొల్లులో ఓడిపోయినా, తిరుపతిలో గెలిచారు. పవన్ మాత్రం ఇటు భీమవరం, అటు గాజవాక.. రెండు చోట్లా ఓడిపోయారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ ఈక్వేషన్స్ చాలా మారాయి. ఎంత మారినా, పది శాతం ఓటు బ్యాంకు జనసేనాని వచ్చే ఎన్నికల్లో సాధించగలుగుతారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనన్న వాదనలున్నాయి.

అయితే, జనసేన ఓటు బ్యాంకు విషయమై వైసీపీ అలాగే టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ అంతర్గత సర్వేల్లో జనసేన ఓటు బ్యాంకు 18 శాతం వరకు పెరిగిందని తేలిందట. టీడీపీ సర్వేల్లోనూ కాస్త అటూ ఇటూగా ఈ ఓటు బ్యాంకు లెక్కలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, జనసేన మాత్రం తమ ఓటు బ్యాంకు ప్రస్తుతం 28 శాతానికి పెరిగినట్లు చెబుతోంది. ఈ మూడున్నరేళ్ళలో అంతలా జనసేన ఏం సాధించింది.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే.

కానీ, కింది స్థాయిలో ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత మీద అధికార పార్టీ విమర్శల తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది. జనసేనకు ఓటు బ్యాంకు అనేది అంతగా లేకపోతే, ఆ పార్టీని అధికార వైసీపీ పట్టించుకునే అవకాశముండదు. జనసేన బలపడింది.. అన్న విషయాన్ని జనసేన శ్రేణులకు కన్ఫామ్ చేస్తున్నది కూడా అధికార పార్టీనే. అధికార పార్టీ ఎంతలా జనసేనను టార్గెట్ చేస్తే, అంతలా జనసేన బలపడుతున్నట్లే.