రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే, ముందుగా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలి. రాజధాని అమరావతి విషయమై కేంద్రం నుంచి స్పష్టత కోరాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలపై నిలదీయాలి. కానీ, ఇవేవీ చేయకుండానే ‘మేం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే’ ప్రయత్నిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఇదెలా సాధ్యం.?
ఢిల్లీలో పడిగాపులు పడి సాధించిందేంటీ.!
ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి పిలుపు వచ్చిందట. ‘సముద్రం ఒకరి ముందు మోకరిల్లదు..’ అంటూ జనసేనాని గురించి సోషల్ మీడియా వేదికగా జనసైనికులు చాలానే చెప్పారు. కానీ, ఢిల్లీలో జనసేనాని ఎందుకు పడిగాపులు కాసినట్లు.? వెళ్ళారు, పడిగాపులు పడి మరీ, అపాయింట్‌మెంట్ సంపాదించారు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. కానీ, పట్టుమని పాతిక సీట్లు కూడా గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంపాదించలేకపోయారు.
ఆత్మగౌరవం అంటే ఇదేనా.!
‘పాచిపోయిన లడ్డూలు..’ అంటూ గతంలో బీజేపీపై విరుచుకుపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరుపతి ఉప ఎన్నికపైనా బీజేపీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ పొందలేకపోయారు. జేపీ నడ్డా బీజేపీకి జాతీయ అధ్యక్షుడైతే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ఆయన పిలిస్తే, ఆయన పరుగెత్తుకెళ్ళారు. పోనీ, ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చారా.? అంటే అదీ లేదాయె.
మాటలు కోటలు దాటేస్తున్నాయ్.. చేతలు చతికిలబడ్తున్నాయ్.!
అమరావతి విషయంలో బీజేపీ ఇలా అనుకుంటోందంటూ, జనసేన అధినేత చెబితే అందులో అర్థమేముంటుంది.? బీజేపీ కేంద్ర నాయకత్వం, ఇంతవరకు అమరావతిపై స్పష్టతనివ్వలేదు. కానీ, జనసేనాని తమకు బీజేపీ నుంచి స్పష్టత వచ్చిందనీ, అమరావతి అక్కడే వుంటుందనీ సెలవిస్తున్నారు. దీన్ని రాజకీయం అని కాక ఇంకేమని పిలవాలి.? రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి.. జనసేన కూడా అదే రాజకీయం చేస్తున్నారు. కాకపోతే, పూర్తి గందరగోళ రాజకీయం అంతే.