మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ పదవికి రాజీనామా నేపథ్యంలో రాజ్‌భవన్‌లో రాధాకృష్ణన్‌కు సత్కారం కార్యక్రమం నిర్వహించారు.
ఇక శుక్రవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. అలాగే సరైన బలం లేకపోయినా సరే ఇండియా కూటమి తమ అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తేదీన పార్లమెంట్‌లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు.
ఈ పోలింగ్‌లో ఎంపీలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788. ఏడు స్థానాలు ఖాళీ కావడంతో ప్రస్తుతం 781 మంది సభ్యులే ఉన్నారు. అయితే పోలింగ్‌కు దూరంగా బీఆర్‌ఎస్ (4), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) పార్టీలు ఉన్నాయి. దాంతో 767 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 15 ఓట్లు చెల్లకపోవడంతో 752 ఓట్లు మాత్రమే లెక్కించారు. ఇందులో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు లభించగా.. ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ 15వ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు.
కాగా సీపీ రాధాకృష్ణన్ అసలు పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. అక్టోబర్ 20, 1957న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. ఆర్‌ఎస్‌ఎస్, భారతీయ జనసంఘ్‌లతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2003 నుంచి 2006 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. జూలై 31, 2024న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. కొన్ని నెలల పాటు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.
