ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగిసింది. ఆయన ఇకపై మాజీ ఉప రాష్ట్రపతి మాత్రమే. సాధారణంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ లాంటి పదవుల్ని నిర్వహించినవారు, తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం చాలా చాలా చాలా అరుదు. ఆయా పదవుల్ని స్వీకరించేటప్పుడే, అంతకు ముందు ఏయే పార్టీల్లో వున్నా, ఆ పార్టీలకు రాజీనామా చేస్తుంటారు.
ఇక, ఉప రాష్ట్రపతి వెంకయ్యానాయుడి గురించి ప్రశంసలు గుప్పిస్తూ, ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజ్యసభ కార్యకలాపాల్లో వెంకయ్యనాయుడు తెచ్చిన మార్పుల గురించి ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతే రాజ్యసభ ఛైర్మన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
నిజమే, వెంకయ్యనాయుడు.. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాల్లో చాలా కీలక పదవులు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ పని చేశారు. ఉప రాష్ట్రపతి అయ్యారు. ఉప రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన దరిమిలా, వెంకయ్య ఏం చేయబోతున్నారు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
అయితే, కేంద్ర మంత్రిగా వున్న వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిని చేసే అవకాశం వున్నా, ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు పరిమితం చేసినట్లు.? అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. పోనీ, ఉప రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి, రాష్ట్రపతిగా ఆయన్ని ఎందుకు ప్రమోట్ చేయలేదు.? అన్న ప్రశ్న ఇప్పటికీ చాలామందిని తొలుస్తోంది. చివరికి ఉప రాష్ట్రపతిగా అయినా వెంకయ్యనాయుడికి ఇంకో అవకాశం ఇచ్చి వుండాల్సిందన్నది చాలామంది అభిప్రాయం.
సరే, కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే, వాళ్ళకి కొన్ని ‘అవసరాలు’ వుంటాయి. వాటికి అనుగుణంగానే, రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి పదవుల్లో ఎవరుండాలన్నది ఖరారు అవుతుంది. ఇప్పుడూ అదే జరిగింది కూడా.! వెంకయ్య గురించి చాలా చాలా గొప్ప మాటలు ఇప్పుడు చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, తన మనసులో వెంకయ్యనాయుడి పట్ల అంత గౌరవభావం వున్నప్పుడు, రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడిని ఎందుకు చేయలేదు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
ఇంతకీ, వెంకయ్య మీద ప్రధాని మోడీ ప్రశంసలు ‘మనసులోంచి’ వచ్చినవేనా.?