భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నియమితులైన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అయితే ఉపరాష్ట్రపతికి అందే ప్రయోజనాల గురించి అంతటా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి తర్వాత దేశంలోనే రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. కానీ సాధారణ జీతం అందని ఏకైక పదవి కూడా ఇదే. రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యక్షంగా జీతం నిర్ణయించలేదు. ఈ పదవిలో నియమితులైన వ్యక్తి పెద్దల సభ అయిన రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ పదవి చేపట్టిన వ్యక్తులు రాజ్యసభ చైర్మన్‌గా జీతం అందుకుంటారు.
వీరికి నెలకు రూ.4లక్షల జీతం అందుతుంది. 2018 వరకు నెలకు రూ.1.25లక్షలు మాత్రమే జీతం వచ్చేది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా దానిని రూ.4లక్షలకు పెంచారు. అంటే సంవత్సరానికి రూ.48లక్షలు పొందుతారు. అలాగే ఉపరాష్ట్రపతికి ఉచిత వసతి, వ్యక్తిగత వైద్య సంరక్షణ, రైలు, విమానంలో ఉచిత ప్రయాణం, ల్యాండ్‌లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సేవలు, వ్యక్తిగత భద్రత, సిబ్బంది వంటి ప్రయోజనాలు పొందుతారు.
ఇక రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతిగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి, పదవీ విరమణ చేసిన వారికి, రాజీనామా చేసిన వారికి నెలకు రూ.2 లక్షల వరకు పింఛన్ లభిస్తుంది. అంతేకాకుండా టైప్-8 బంగ్లా, వ్యక్తిగత కార్యదర్శి, అదనపు వ్యక్తిగత కార్యదర్శి, సహాయకుడు, వైద్యుడు, ఒక నర్సింగ్ అధికారి ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణిస్తే జీవిత భాగస్వామికి జీవితాంతం టైప్-7 ఇల్లు కేటాయిస్తారు.
మొన్నటివరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాల రీత్యా జులై 21న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ అయిన సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించారు. అలాగే ఇండియా కూటమి అభ్యర్థిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నియమించారు. సెప్టెంబర్ 9న జరిగిన పోలింగ్‌లో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు.
