ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ దంతాల సమస్యలు వేదిస్తున్నాయి. దీంతో ఈ కాలంలో ప్రజల్లో నోటి పరిశుభ్రతపై అవగాహన గణనీయంగా పెరిగింది. కేవలం బ్రషింగ్‌తో సరిపెట్టకుండా.. నోటిలో బ్యాక్టీరియా తగ్గించేందుకు చాలా మంది ఇప్పుడు మౌత్‌వాష్‌లను రోజువారీ అలవాటుగా మార్చుకుంటున్నారు. నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే వచ్చే దుర్వాసనతో పాటు దంతాలు బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తాజాగా మౌత్‌వాష్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. కానీ ప్రతి మంచి వస్తువు సరైన విధంగా వాడకపోతే దుష్పరిణామాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మౌత్‌వాష్ వాడకం వల్ల మొదట నోటిలో చల్లదనం, తాజాదనం అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా కార్యాలయాలు, పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాల్లో దుర్వాసన సమస్యను తగ్గించడానికి ఇది తక్షణ పరిష్కారంలా పనిచేస్తుంది. నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియాను తగ్గించడం ద్వారా దంతాలు పుచ్చిపోకుండా కాపాడడంలో ఇది సహాయపడుతుంది. పైగా ఫ్లాసింగ్, బ్రషింగ్ చేసిన తర్వాత మౌత్‌వాష్ వాడితే నోటి పరిశుభ్రత మరింత మెరుగ్గా ఉంటుంది.
అయితే ఇదే మౌత్‌వాష్ తప్పుగా లేదా అధికంగా వాడితే సమస్యలు మొదలవుతాయి. కొన్ని మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ అధికంగా ఉంటుంది. దీని వలన నోటిలో సహజమైన తేమ తగ్గిపోతుంది. దీర్ఘకాలం వాడినవారిలో నోరు పొడిబారడం, తాగిన నీరు కూడా సరిపోక దాహం పెరగడం, చిగుళ్ల సున్నితత్వం అధికమవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, నోటి సహజ రుచి మారిపోవడం, దంతాలపై మచ్చలు ఏర్పడడం కూడా రసాయన ప్రభావంతో జరుగుతుంది.
దంత వైద్య నిపుణుల ప్రకారం.. మౌత్‌వాష్ వాడే ముందు దాని లేబుల్‌ని చదవడం తప్పనిసరి. ఆల్కహాల్ లేని, తక్కువ ఘాడత కలిగిన ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతిసిద్ధంగా తయారైన మౌత్‌వాష్‌ల వైపు కూడా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నిమ్మరసం, పుదీనా, ఉప్పు నీరు వంటి సహజ పదార్థాలతో తయారైన మౌత్‌వాష్‌లు హానికర రసాయనాల సమస్య లేకుండా నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చవకగా, సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మౌత్‌వాష్ అనేది బ్రషింగ్, ఫ్లాసింగ్‌కు ప్రత్యామ్నాయం కాదు. అది కేవలం అదనపు పరిశుభ్రత కోసం ఉపయోగించాల్సిన సహాయక పద్ధతి మాత్రమే. సరైన మోతాదు, సరైన ఉత్పత్తి, సరైన విధానం పాటిస్తే మౌత్‌వాష్ వాడకం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే అదే మౌత్‌వాష్ సమస్యలకు కారణమవుతుంది.
నోటి శుభ్రత కోసం మార్కెట్లో అనేక రకాల మౌత్‌వాష్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో తరచుగా రసాయనాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల కొన్నిసార్లు నోరు పొడిబారడం, రుచి కోల్పోవడం లేదా సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఇంట్లో తయారుచేసిన సహజసిద్ధమైన మౌత్‌వాష్ ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
వేప, పుదీనా ఆకులు నోటిలోని క్రిములను నాశనం చేయడంలో, దుర్వాసనను తగ్గించడంలో చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. సహజసిద్ధమైన మౌత్‌వాష్‌ను తయారుచేయడానికి, ఒక కప్పు నీటిని బాగా మరిగించి, అందులో కొన్ని వేప పుదీనా ఆకులను వేయాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు ఉడికించిన తర్వాత చల్లార్చి, వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది, దంతాలు శుభ్రంగా ఉంటాయి, నోటిలో తాజాదనం నిలిచి ఉంటుంది. ఈ సహజ మౌత్‌వాష్‌లో ఎలాంటి రసాయనాలు లేనందున ఇది పూర్తిగా సురక్షితమైనది పర్యావరణ అనుకూలమైనది.
