చంద్రబాబుకు మోదీ కౌంటర్ పంచ్

(ప్రసాద్ గోసాల*)

దేశంలో ప్రచారంలో ఎవరైనా ముందుంటారంటే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. 1978లో రాజకీయజీవితం కాంగ్రెస్ తో ప్రారంభించిన చంద్రబాబు ఆనక మామ ఎన్.టి.రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి మామకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారన్న అపవాదును మూటగట్టుకున్నారు.

కొన్నాళ్ళు కమ్యూనిస్టులతో, మరి కొన్నాళ్ళు బిజెపి  స్నేహం చేసి మళ్ళీ అవకాశం చూసుకుని విడిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన రాజకీయ విద్య. అయితే అయన వేేసే ఎత్తుగడల వెనుక పూర్తిగా మీడియా ప్రచారం ఉంటుంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి బిజెపితో పొత్తును తెగత్రెంపులు చేసుకునే విషయంలోను , ఆపై మోదీ పై ప్రచారాస్త్రాలను సంధించడంలో తెలుగు మీడియా తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ సహాయ సహకారాలు చంద్రబాబుకు అందిస్తోంది. దాదాపుగా మోదీపై నిందారోపణలు చేసి ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఒక్క వోటు కానీ ఒక్క సీటు కానీ రావని ప్రజలను ఏమర్చడానికి చంద్రబాబు చేయని విన్యాసం లేదు. 

అయితే ప్రచారంలో చంద్రబాబు కంటే   రెండాకులు ఎక్కువ చదివిన వ్యక్తిగా మోదీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.  వాజ్ పేయి ప్రభుత్వ ంలో చక్రం తిప్పిన చంద్రబాబు  గోద్రా సంఘటన తర్వాత చాలా తీవ్రంగా మోదీపై విరుచుకు పడ్డారు. పాపం చంద్రబాబుకు దూరదృష్టి లేకో , కాలం కలిసి రాకో, అదే మోదీతో 2014లో జత కట్టాల్సి వచ్చింది. నాలుగేళ్ళ కలిసి పనిచేసిన చంద్రబాబు హోదా గోదాలోకి దిగి మోదీ చేతిని వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా సభలు నిర్వహించి భారీ ఎత్తున మోదీకి వ్యతిరేకత ఉందన్న భ్రమ కల్పించారు. అదే విధంగా నాలుగేళ్లలో  కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చేసిందేమీ లేదని తన అనుకూల పత్రికలలో రాసిందే రాయించి రాయించి ప్రజలు నమ్మేలా చేద్దామనుకున్నారు. తన ప్రచారాన్ని కేంద్రం గమనించేదెప్పుడు కౌంటర్ చేసే దెప్పుడన్నది ఆయన ధీమా.

నాలుగు నెలల పాటు చంద్రబాబు సృష్టించిన మీడియా వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకున్న మోదీ ప్రభుత్వం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రత్యామ్నాయ , ప్రఛ్చన్న యుద్దానికి తెర లేపింది. తన సొంత మీడియా ప్రచార యంత్రాంగంతో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఏఏ ప్రాజెక్టులకు ఏఏ అనుమతులు ఇచ్చారో, ఎన్ని విద్యారంగ సంస్థలను ప్రారంభించారో పేర్కొంటూ డిఏవిపి సంస్థ ద్వారా  తెలుగు పత్రికలలోనే ప్రచారాన్ని ప్రారంభించింది.

మొదటి ప్రకటన ఆగస్టు 7న విద్యా సంస్థల గురించి వివరిస్తే. ఆగస్టు 14న విడుదల చేసిన మరో ప్రకటన పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులు, అనుమతుల గురించి వివరించింది. ఇప్పుడు ప్రచార యుద్ధంలో బిజెపి తనదైన  శైలిలో కొత్త ఎత్తుగడకు తెరలేపింది. మరి ఈ ప్రచార యుద్ధంలో చంద్రబాబు ఎలా స్ప ందిస్తారో చూడాలి.

 

 

 

 

(*ప్రసాద్ విఎస్ డి  గోసాల సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)