దుబ్బాక ఉప ఎన్నికలు గడిచాయి. ఆ ఎన్నికల్లో తెరాస, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట తెరాసకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అవుతుందని అందరూ భావించారు. కానీ ఎన్నికలకు పది రోజుల ముందు సీన్ మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి బీజేపీ తెరాసకు ఎదురు నిలబడింది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. పోలింగ్లో సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు కౌంటింగ్ అప్డేట్స్ సైతం ప్రధాన పోరు తెరాస, బీజేపీల నడుమే ఉందని చెబుతున్నాయి. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో సైతం ఆ రెండు పార్టీలే ప్రధాన పోటీదారులుగా అవతరించాయి.
ఇప్పటి నుండే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీల పెద్ద తలలు. టిఆర్ఎస్ తరపున కేటీఆర్ ఎన్నికలు బాధ్యతలు చూస్తుండగా బీజేపీ తరపున బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రత్యర్థులను ఇరుకునపెట్టడానికి అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ ఏమో హైదరాబాద్ వరదలను ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ తెరాస పాలనలో విఫలమైందని చిత్రీకరించడానికి రెడీ అవుతుంటే కేటీఆర్ సైతం ఆ హైదరాబాద్ వరదల అంశాన్నే అనుకూలంగా వాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
బీజేపీ మీద పోరాటం చేయడంలో కేసీఆర్ కు ఎలాంటి అడ్డంకులు, మొహమాటలు లేవన్నది వాస్తవం. అందుకే కేటీఆర్ పూర్తి స్వేచ్ఛతో విమర్శలు గుప్పిస్తున్నారు. వరదల కారణంగా నగరానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సాధారణంగా ఇలాంటి విపత్తు వస్తే ఏ ప్రభుత్వమైన కేంద్రం నుండి సహాయం కోరుతుంది. కేసీఆర్ కూడ అదే చేశారు. 1350 కోట్ల రూపాయలు సహాయ నిధులు ఇవ్వాలని మోడీని కోరారు. కానీ మోడీ ఇంతవరకు స్పందించలేదు. ఒక్క రూపాయి కూడ విదల్చలేదు. ఈ విషయాన్నే హైలెట్ చేస్తున్న కేటీఆర్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన సహాయం లెక్కలు లాగుతున్నారు.
గుజరాత్ రాష్ట్రానికి 500 కోట్ల సహాయం చేసిన మోడీ సర్కార్ కర్ణాటకకు 670 కోట్ల రూపాయల నిధులు విడుదలచేసింది. కానీ కష్టాల్లో ఉన్న తెలంగాణకు ఒట్టి చేతులు చూపిస్తోంది. అలాగే 2014 నుండి ఇప్పటివరకు తెలంగాణ నుండి 2 లక్షల 72 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వెళ్లగా కేంద్రం నుండి తిరిగి లక్ష 40 వేళా కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ఇచ్చిన దానికి పుచ్చుకున్న దానికి మధ్య లక్ష కోట్ల పైగానే వ్యత్యాసమే ఉందని కేటీఆర్ చెబుతున్నారు. ఇలానే ఇంకొన్నిలెక్కలను తీసి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మరి ఆయన ప్లాన్ ఏమాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.