కేటీయార్ ‘హ్యాట్రిక్’ కామెంట్స్.! అంత సౌండ్ లేదేం.?

‘ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పయ్యే అవకాశం లేకపోలేదు. మేం గెలుస్తాం, గెలిచి తీరతాం.! కాదు కాదు, గెలిచేశాం.! తిరిగి ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తున్నాం. కేసీయార్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొడుతున్నారు. ఈ గెలుపు మాకు, తెలంగాణకు చాలా ముఖ్యం. చాలా చాలా ఆనంద దాయకం..’ అంటున్నారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే, మీడియా ముందుకు వచ్చిన కేటీయార్, ‘ఎగ్జిట్ పోల్ అంచనాల్ని’ లైట్ తీసుకున్నారు. కారణం, ఎందులోనూ బీఆర్ఎస్‌కి అనుకూలంగా నంబర్స్ కనిపించలేదు మరి.!

గ్రేటర్ పరిధిలో ఓటర్లు ఓట్లేయడానికి రాకపోవడంపై కేసీయార్‌లో ఒకింత అసహనం వ్యక్తమవుతోందిట. అయితే, ఆ విషయాన్ని ఆయన అస్సలు బయటపెట్టలేకపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా అది తొందరపాటే అవుతుందనేది ఆయనకీ తెలుసు.

నిజానికి, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళి చూస్తే, ఇలా జరగొచ్చు.. అని అంచనా వేయడం కష్టమే. ఓటింగ్ పెద్దగా నమోదవలేదు సాయంత్రం ఐదు గంటల సమయానికి. చివరికి ఎన్నికల కమిషన్ ఎంత ఓటింగ్ డిక్లేర్ చేస్తుందో ఏమో.! ఈలోగా ఏం మ్యాజిక్ జరుగుతుందో కూడా.!

కాగా, మీడియా ముందుకొచ్చిన కేటీయార్ ఒకింత ముబావంగానే కనిపించారనీ, లోపల వున్న ఆందోళనని తొక్కి పెట్టి, మీడియా ముందుకొచ్చి మమ అనిపించేశారనీ.. మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమే, కేటీయార్ వ్యాఖ్యల్లో సౌండ్ బాగా తగ్గిపోయింది.

కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తవం. బీజేపీకి అరడజను సీట్లు వచ్చినా, ఆ పార్టీ కూడా పుంజుకున్నట్లే. ఒకవేళ బీజేపీ డజను సీట్లు కొల్లగొడితే.. బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నట్లే అవుతుంది. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో బోల్తా పడితే ఇంకేమన్నా వుందా.? కోలుకోవడం చాలా చాలా కష్టం. అదీ కేటీయార్ ఆందోళనకి కారణం.