గులాబీ పార్టీ ఓడితే, కేటీయార్ విదేశాలకేనా.?

1307552-ktr

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఉద్యమ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసింది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గెలిచి, హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామంటోంది.

కానీ, గులాబీ పార్టీ ఓడితే, తెలంగాణ మంత్రి కేటీయార్ విదేశాలకు పారిపోవడం ఖాయమన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మైనంపల్లి హన్మంతరావు అయితే, కేటీయార్ మీద డ్రగ్స్ సహా అనేక ఆరోపణలు చేస్తున్నారు.

‘రేయ్..’ అని కేటీయార్‌ని సంబోదిస్తూ, బీఆర్ఎస్ గనుక ఓడిపోతే, నీ పరిస్థితి అత్యంత అధ్వాన్నం, విదేశాలకు పారిపోవాలనుకుంటున్నావేమో.. అక్కడా నీకు స్థానం వుండదంటూ మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. తన కుమారుడికి టిక్కెట్ రాకపోవడంతో, మైనంపల్లి బీఆర్ఎస్‌ని వీడిన సంగతి తెలిసిందే.

ఇక, కేటీయార్ విదేశాలకు పారిపోవడంపై బీజేపీ నేతలు కూడా మైనంపల్లి తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు. కానీ, గెలిచినా ఓడినా తెలంగాణ గడ్డ మీదనే తేల్చుకుంటామంటోంది బీఆర్ఎస్. ఓడితే రాజకీయంగా తమకు వచ్చిన నష్టమేమీ వుండదనీ, తెలంగాణ సమాజమే నస్టపోతుందనీ బీఆర్ఎస్ అధినేత కేసీయార్ పలు బహిరంగ సభల్లో నినదిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. మెజార్టీ సర్వేలు గులాబీ పార్టీకి అనుకూలంగా ముందస్తు సర్వేల ఫలితాల్ని వెల్లడించినా, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం గులాబీ పార్టీకి పెద్ద దెబ్బే. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీగా వున్న టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాజకీయంగా ఎదిగింది. బీఆర్ఎస్‌గా మారాక, జాతీయ స్థాయి పార్టీగా అవతారమెత్తాలనుకుంటోంది.

కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ, మళ్ళీ ప్రాంతీయ రాజకీయం చేస్తోంది. ఓడితే మాత్రం, గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమే అవ్వొచ్చు.