Kondagattu Fire: కొండగట్టు అగ్నిప్రమాదం ప్రభుత్వ వైఫల్యమే.. బాధితులకు రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి: కేటీఆర్

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆస్తి నష్టం ఈ ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో సుమారు 30 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం అప్పులు చేసి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో రోడ్డున పడ్డాయని విచారం వ్యక్తం చేశారు.

ఫైరింజన్ల నిర్వహణపై ఆగ్రహం అగ్నిమాపక శకటాలు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోకపోవడమే నష్టం పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల ఫైరింజన్ మరమ్మతులో ఉండటం, వచ్చిన మరో ఇంజన్ పనిచేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

బాధితులకు అండగా బీఆర్ఎస్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించకపోతే, పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Cine Critic Dasari Vignan EXPOSED On I Bomma and Website | Telugu Rajyam