జీరా వాటర్ vs సోంపు వాటర్.. పరగడుపున ఏది తాగితే ఆరోగ్యానికి మేలు..!

పొట్టలో కాస్త అసౌకర్యంగా అనిపించగానే.. మన దేశంలో చాలా మంది వంటింటి వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. జీర్ణ సమస్యలకు మందులా పనిచేసే రెండు సహజమైన గింజలు జీరా (జీలకర్ర) మరియు సోంపు. వీటిని కొంతమంది నేరుగా నమిలేస్తారు. మరికొందరు వాటర్ రూపంలో తీసుకుంటారు. ముఖ్యంగా వీటిని పరగడుపున తాగడం చాలామందికి అలవాటైంది. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది.. ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిజానికి ఈ రెండూ జీర్ణవ్యవస్థను మేలుపరచడంలో పోటీ పడుతుంటాయి. కానీ తీరుతెన్నుల్లో మాత్రం తేడాలున్నాయి. ఉదయమే గోరు వెచ్చని నీటిలో జీలకర్ర నానబెట్టి తాగితే గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటివి దూరమవుతాయి. అంతేకాదు, ఇది కొలెస్ట్రాల్‌ని కరిగించి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం నివారిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉంటుంది. స్ట్రోక్‌ లేదా అటాక్‌ల రిస్క్‌ తగ్గుతుంది.

ఇక సోంపు వాటర్‌ విషయానికి వస్తే, ఇది బాడీలో ఉన్న అధిక వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే కూలింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. ఇది కూడా జీర్ణానికి తోడ్పడుతుంది. మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది మంచి ఆప్షన్. సోంపు ఆకలి నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది. ఏ మాత్రం పొట్టలో అసిడిటీ లేదా బరువుగా ఉన్న ఫీలింగ్‌ ఉన్నా సోంపు వాటర్ తాగితే వెంటనే రిలీఫ్‌ వస్తుంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. జీరా వాటర్ గుండె ఆరోగ్యం కోసం అయితే, సోంపు వాటర్ శరీర వేడి తగ్గించేందుకు.. మనకు బాగా ఉపయోగపడుతుంది. ఒకటి హార్ట్ కోసం బలంగా పని చేస్తే, మరొకటి డైజెస్టివ్ హెల్త్, బరువు నియంత్రణలో కీలకంగా నిలుస్తుంది. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు మాత్రం వైద్యుల సలహా తీసుకున్నాకే వీటిని తీసుకోవాలి. ప్రతి శరీరానికి స్పందన వేరేలా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం.

మొత్తంగా చూస్తే “జీరా బెటరా? సోంపా?” అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం లేదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏదైతే మీకు సరిపోతుందో అదే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్య పరిరక్షణకు ఈ రెండు గింజలూ మీ వంటింట్లో ఉండాల్సిన నిత్యావసర ఔషధాలు అంటున్నారు నిపుణులు.