పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే దాదాపు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు పోగొట్టుకుని, ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకున్న వైనం అటుంచితే, సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్లా పరాజయం పాలుగావడంతో జనసేన పార్టీ పుట్టినరోజే గిట్టినట్లయింది. ఎన్నికలకు ముందు కొందరు, ఎన్నికల తరువాత కొందరు ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆ పార్టీ సిద్ధాంతకర్త కూడా పవన్ కళ్యాణ్ మీద అనేక ఆరోపణలు చేసి ఛీ కొట్టి వెళ్ళిపోయాడు.
ప్రజాసేవకోసం పాతికేళ్ళయినా రాజకీయాల్లో కొనసాగుతానని, సినిమాలు మానేస్తానని ఎన్నికలవరకు ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం తన జనసేన నిర్జనసేనగా మిగిలిపోవడంతో, రాజకీయాల్లో తనకు భవిష్యత్తు లేదని గ్రహించి… ఇచ్చిన మాట తప్పి మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు ఏమాత్రం అనురక్తి లేదని, సినిమాలు రాజకీయాలు వేరు వేరు రంగాలని ఏనాడో తేలిపోయింది. పవన్ కన్నా పదిరెట్లు మిన్నగా అభిమానులను కలిగున్న చిరంజీవి లాంటివాడే రాజకీయాల్లో ప్రవేశించి రాణించలేక నానా సర్కస్ ఫీట్లు చేసి కనీసం కొంతకాలం అయినా కేంద్రమంత్రి అనిపించుకుని ఇప్పుడు బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పవన్ ఊగుడును చూస్తూ వెర్రికేకలు పెట్టి ఆనందించే అభిమానులు కూడా క్రమక్రమంగా జనసేనకు దూరం అయ్యారు. పులితోలు కప్పుకున్నంత మాత్రాన మేక పులిగా మారిపోదు కదా! తమ అభిమాన నాయకుడు సినిమాల్లోనే పులి తప్ప రాజకీయాల్లో పిల్లి మాత్రమే అని వారు అర్ధం చేసుకోవడానికి కొద్దిగా ఆలస్యం అయింది అంతే!
విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ బలాన్ని జగన్మోహన్ రెడ్డి అంచనా వేసినట్లు మరెవ్వరూ వేయలేకపోయారు. ఆయనకు సినిమాల్లో ఇమేజ్ ఉందేమో కానీ, రాజకీయాల్లోకి కావలసిన లక్షణాలు పవన్ లో ఏమీ లేవని జగన్ ఏనాడో గ్రహించడంతో పవన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ స్పందించలేదు. దాంతో జగన్ మీద ద్వేషం పెంచుకుని పవన్ కళ్యాణ్ ఎన్ని అవాకులు చవాకులు పేలినా జగన్ ఏమాత్రం స్పందించలేదు. పైగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నుంచి పాకేజీ అందుతుందని, చంద్రబాబు చెప్పినట్లు పవన్ డాన్స్ చేస్తాడని ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. దాంతో ఆదిలోనే హంసపాదు అన్నట్లు తొలి ఎన్నికల్లోనే జనసేన ఏకసేనగా అభాసుపాలయింది.
అలాంటి జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నపుడే జనం విరగబడి నవ్వుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తరువాత అధ్యక్షుడు అయిన సోము వీర్రాజు కూడా పవన్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. తనలో ఆవగింజంత సత్తా కూడా లేదని ఆల్రెడీ నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ లో వీర్రాజుగారికి ఏమి కండలు కనిపించాయో కానీ, కొంచెం మితిమీరిన భజన చేశారు. పొత్తు ధర్మాన్ని అనుసరించి పవన్ కళ్యాణ్ దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీకి ప్రచారం చెయ్యలేదు. ఇపుడు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని ఊహించుకున్నారు చాలామంది జనసైనికులు. హైద్రాబాద్ లో కనీసం రెండు మూడు కార్పొరేషన్ సీట్లైనా వస్తాయేమో అని కోటి ఆశలు పెట్టుకున్నారు. నిజానికి బీజేపీతో పోలిస్తే తెలంగాణాలో జనసేనకు అసలు నూకలే లేవు. కానీ, జనసేన మాత్రం తానేదో ఎవరెస్టు శిఖరాన్ని అని భ్రమపడుతూ బీజేపీ వచ్చి తనను పొత్తుకోసం బతిమాలుతుంది అని భావించారు. ఇంతలోనే అనుకున్నది ఒకటి అయింది మరొకటి అన్నట్లు జనసేనతో ఎలాంటి పొత్తు ఉండదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడంతో పదిమాసాల సహజీవనం వార్షికోత్సవానికి కూడా నోచుకోకుండా అబార్షన్ అయినట్లయింది! పవన్ కళ్యాణ్ కు ఇంకా ఏదో ప్రజాబలం ఉన్నదని, అయన వలన నాలుగు ఓట్లు వస్తాయని ఎవరైనా నమ్ముతుంటే వారిని పిచ్చివారిగా జమకట్టి జాలిపడాల్సిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనేవి నాయకుడి మనుగడను నిర్దేశిస్తాయి. అవి రెండూ లేని నాయకులకు రాజకీయాల్లో స్థానం లభించదు. ఎవరూ గౌరవించరు. ఇపుడు తెలంగాణాలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ ద్వారా జరిగింది దుర్భర అవమానమే.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు