అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటూ రెండు వందల అరవై రోజులుగా ఒక పెద్ద డ్రామా మూడు గ్రామాల్లో కలెక్షన్లు లేని చిన్న హీరో సినిమాలా నడుస్తున్నది. ఎన్ని రోజులు గడిచినా ఆ యాభై మంది తప్ప మరో పదిమంది ఎక్కువ ఆర్టిస్టులు కనిపించడంలేదు. ఈ డ్రామాకు రచన, నిర్మాత, దర్శకత్వం ఎవరివో చెప్పాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి వేలకోట్ల రూపాయలు ఆర్జించవచ్చన్న ‘అశుభసంకల్పం” జగన్ రాకతో విఫలమైపోవడంతో కడుపుమంట తాళలేక షామియానాలు వేసుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. వారికి తోడుగా ఎల్లో మీడియా ఎలాగూ ఉన్నది. టీవీల్లో రోజూ పన్నెండు గంటల పాటు అమరావతి దీక్షల మీద చర్చోపచర్చలు చేస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషిస్తూ అదే పోరాటం అని భ్రమిస్తూ వంతులవారీగా దీక్షానాటకాలు ఆడుతున్నారు.
ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇరవైతొమ్మిది గ్రామాల రైతులు తమ పొలాలను స్వచ్ఛందంగా రాజధాని కోసం త్యాగం చేస్తే, ఆ శిబిరాల్లో కనీసం ఇరవైతొమ్మిది వేలమంది అయినా కనిపించాలి. పోనీ, గ్రామానికి వందమంది ఉద్యమంలో పాల్గొన్నా, మూడువేలమంది కనిపించాలి కదా? అక్కడ మనకు కనిపిస్తున్న ఆర్టిస్టులు వందమంది కూడా లేరు. దీన్నిబట్టే అక్కడ జరిగేది అంతా డ్రామా అని స్పష్టం కావడం లేదూ? ఒకవేళ నిజంగా అక్కడ రాజధానికోసం మహోధృత ఉద్యమమే జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా? ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. లేదా వారితో సంప్రదింపులు జరపాలి. ఆ రెండూ జరగడం లేదంటే అది పచ్చ ఛానెల్స్ కోసం జరుగుతున్న ఉద్యమం తప్ప నిజమైన ఉద్యమం కాదని వేరే చెప్పాల్సిన పనేలేదు.
ఇక అమరావతి వికేంద్రీకరణ తో తీవ్రంగా దెబ్బతిన్నది చంద్రబాబు, ఆయన పార్టీలోని కొందరు ముఖ్యులు. బినామీల పేర్లతో వందల ఎకరాలు కారు చౌకగా దురాక్రమించేశారు వారు. మళ్ళీ చంద్రబాబే గెలిస్తే ఆ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చని కలలు కన్నారు. ఇప్పుడు జగన్ నిర్ణయంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. లేకపోతె…అక్కడ ఒక పరిశ్రమ లేదు…ఒక విమానాశ్రయం లేదు…ఒక రైల్వే స్టేషన్ లేదు..ఒక విశ్వవిద్యాలయం లేదు…ఒక పాఠశాల లేదు…అక్కడ ఎకరం అయిదు కోట్లు, పదికోట్లు ఏమిటి విడ్డూరం కాకపొతే! రాజధాని పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ దోపిడీ పధకానికి చెక్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దాంతో వారి ఆక్రోశం ఉద్యమ డ్రామాగా మారింది.
రైతులను ఉద్యమం పేరుతో రెచ్చగొట్టే చంద్రబాబు గత తొమ్మిది నెలల్లో ఒక్కసారైనా రైతుల సరసన కూర్చుని ఉద్యమానికి మద్దతు పలికారా? ఒక్క పూట నిరాహారదీక్ష చేశారా/ పోనీ, తన కొడుకును కూర్చోబెట్టి ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారా? రైతులతో కల్సి పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారా? అసలు ఆ శిబిరంలో ఒక్కరోజైనా తండ్రీకొడుకులు రైతులకు సంఘీభావంగా పాల్గొన్నారా? మొన్ననే హంతకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, ఈఎస్సై కుంభకోణంలో నూటయాభై కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పనిగట్టుకుని వెళ్లి పరామర్శించిన చంద్రబాబు అక్కడే జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమ స్థలానికి వెళ్లి రైతులతో ఒక్క మాట మాట్లాడారా? ‘పోరాటం చెయ్యండి’ అని హైద్రాబాద్ నుంచి జూమ్ ద్వారా కేకలు పెట్టేబదులు ప్రత్యక్షంగా అక్కడకి వెళ్ళినపుడు కూడా కనీసం రైతుల ముఖం చూడలేదంటేనే అక్కడ జరిగే ఉద్యమం అంతా డబ్బులిచ్చి ఆడిస్తున్న డ్రామా అని తేలిపోతుంది. చంద్రబాబుకు బదులుగా ఆ రైతులు జగన్మోహన్రెడ్డిని నమ్ముకుని ఉంటె వారికి ఈ పాటికి వారు కోరుకున్న న్యాయం జరిగి ఉండేది. ఒకవేళ వారికి జగన్ చేసే మేలు కన్నా చంద్రబాబు దగ్గరే మంచి తాత్కాలిక పారితోషికం ముడుతున్నది అనుకుంటే ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.