అమెరికా అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించడంతో, బహిష్కరణకు గురైన భారతీయుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు నెలకొన్నాయి. ఇప్పటికే 104 మంది భారతీయులను మిలటరీ విమానంలో పంపించగా, మరో వేలాది మందిని తిరిగి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ఈ వలసదారులు భారత్‌లో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనకపోయినా, ఇకపై అమెరికా లేదా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మళ్లీ అడుగుపెట్టడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఈ వలసదారులు నకిలీ పత్రాలతో వెళ్లి ఉంటే తప్ప, వారికి భారత్‌లో చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశమేమీ లేదని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. నిజమైన పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే ధ్రువీకరణ పత్రాలు ఉన్నవారికి ఎలాంటి శిక్ష ఉండదని, కానీ నకిలీ పత్రాలు ఉపయోగించిన వారు మాత్రం విచారణకు గురవుతారని అంటున్నారు. అసలు సమస్య వారికి విదేశీ వీసా దొరకడం కష్టమవడం. ప్రత్యేకించి, అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, స్కెంజెన్ దేశాలు ఈ వలసదారులకు మరో అవకాశం ఇచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.
అమెరికా బహిష్కరణ విధించిన వ్యక్తులు కనీసం ఐదేళ్ల పాటు తిరిగి వీసాకు అర్హులు కారు. చాలా సందర్భాల్లో ఈ నిషేధం పదేళ్లకు పొడిగించబడుతుంది. అమెరికా ఎంబసీ నిబంధనల ప్రకారం, అక్రమంగా ప్రవేశించిన వారిపై పలు కఠిన చర్యలు అమలవుతాయి. ఈ నేపథ్యంలో, బహిష్కరణకు గురైన వారు ఇకపై విదేశాల్లో జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు అవకాశమే లేదనే చెప్పాలి.
వలసదారులను అక్రమంగా పంపే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఏజెంట్లను గుర్తించి విచారణ చేపడుతున్నారు. అక్రమ మార్గాల్లో లక్షల రూపాయలు తీసుకుని వలసదారులను పంపిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో, అమెరికా వెళ్లే ఆశతో వేలాది మంది యువతీయువకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.