రామ తీర్థం ధర్మ యాత్ర.. అంటూ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ రోజు ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయానికి సంబంధించి ఓ దేవాలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని దుండుగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ, జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే, నిరసనలు ఉద్రిక్త రూపం దాల్చే అవకాశం వుందన్న కోణంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. అయితే, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు రామతీర్థం వెళితే, ఆయన వెంట పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు వెళ్ళారుగానీ.. పోలీసులు ఎవర్నీ పెద్దగా అడ్డుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే, అప్పుడు కూడా చంద్రబాబుని అనుమతించామనీ, నిరసనలకు అనుమతివ్వలేదని పోలీసు శాఖ చెబుతోంది.
కానీ, బీజేపీ – జనసేన నేతలు మాత్రం వైసీపీ – టీడీపీ మధ్య ఒప్పందం బట్టబయలయ్యిందని ఆరోపిస్తుండడం గమనార్హం. ఇటు బీజేపీ, అటు జనసేనకు చెందిన ముఖ్య నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేశారు. కార్యకర్తల్ని నిలువరించారు. అయినాగానీ, పోలీసుల ఆంక్షల నుంచి తప్పించుకుని బీజేపీ, జనసేన శ్రేణులు రామతీర్థం చేరుకున్నాయి. షరతులతో కూడిన అనుమతుల్ని కొందరు నేతలకైనా పోలీసులు ఇచ్చి వుంటే, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చి వుండేది కాదు. ఇదిలా వుంటే, హిందూ సమాజంపై జగన్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష.. అంటూ బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు సంచలన రీతిలో ప్రశ్నలు కురిపించారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న దరిమిలా, ప్రభుత్వంపై చెడ్డపేరు రాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన బాద్యత ముఖ్యమంత్రి మీదనే వుంది. అధికార పార్టీ నేతలు కూడా, ప్రభుత్వంపై ఈగ వాలనియ్యకుండా చేయాలి తప్ప, విపక్షాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో పలచనవడం మంచిది కాదు. ఎటూ ప్రభుత్వం ఈసారి మరింత సీరియస్‌గా స్పందిస్తామంటోంది గనుక.. ఇకపై ఆంధ్రపదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరగకూడదనే ఆశిద్దాం.