రోజంతా ఆఫీస్ పనులు, ప్రయాణాలు, బాధ్యతలతో బిజీగా గడిచిన తర్వాత రాత్రిపూటే చాలామందికి ప్రశాంతత దొరుకుతుంది. అదే సమయంలో ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి భోజనాన్ని భారీగా, కారంగా, ఇష్టమైన ఆహారాలతో తినడం ఇప్పుడు చాలా మందిలో సాధారణ అలవాటుగా మారింది. కానీ ఈ అలవాటు వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి చాలామందికి అవగాహన లేకపోవడమే అసలు సమస్యగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట ఎక్కువగా బిర్యానీ, కబాబ్స్, చికెన్ 65 లాంటి వేయించిన ఆహారాలు తినడం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆహారాల్లో ఉండే అధిక సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి, గుండె సంబంధిత సమస్యలకు బీజం పడుతుంది. మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, కాలక్రమేణా ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారుతుంది.
ఇక జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, సూర్యాస్తమయం తర్వాత మన శరీరం సహజంగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్తుంది. అలాంటి సమయంలో ఆలస్యంగా లేదా భారమైన ఆహారం తీసుకుంటే, అది పూర్తిగా జీర్ణం కాకుండా కడుపులోనే ఉండిపోతుంది. ఫలితంగా మరుసటి రోజు ఉదయం కూడా కడుపు బరువుగా ఉండటం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే పెద్దప్రేగు సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం ప్రమాదం కూడా రాత్రి ఆలస్యంగా తినే అలవాటుతో నేరుగా సంబంధం కలిగి ఉందని వైద్యులు చెబుతున్నారు. పగటిపూట ఆహారంపై నియంత్రణ ఉన్నా, రాత్రి సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న చపాతీ, దోస, రైస్ ఆధారిత ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి రాత్రంతా అధికంగా ఉంటుంది. దీని ప్రభావం మరుసటి రోజు ఉదయం ఫాస్టింగ్ షుగర్ పెరగడంలో స్పష్టంగా కనిపిస్తుంది.
అదే సమయంలో రాత్రి ఆలస్యంగా తినడం, వెంటనే పడుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. రాత్రిపూట రక్తపోటులో వచ్చే హెచ్చుతగ్గులు గుండెకు తీవ్ర ప్రమాదంగా మారే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమితో కలిసినప్పుడు గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
రాత్రిపూట అధిక కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడం అనేది చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఇది కేవలం ఊబకాయంతోనే ఆగిపోదు. నిద్ర సమయాలు తప్పడం, రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం అలవాటుగా మారితే శరీరంలో మెటబాలిజం పూర్తిగా దెబ్బతింటుంది. దీని ఫలితంగా తీవ్రమైన ఊబకాయం, హార్మోనల్ అసమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, రాత్రి భోజనం తేలికగా, సమయానికి తినడం, భోజనం చేసిన తర్వాత కనీసం మూడు గంటల గ్యాప్ ఇచ్చి నిద్రపోవడం ఆరోగ్యానికి అత్యంత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న అలవాట్లలో మార్పు చేసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలను ముందే నివారించవచ్చని వైద్యలు చెబుతున్నారు.
