పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ చొరబాటు కానుందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరిట రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో హమాస్ నేత ప్రసంగించే అవకాశముందని సమాచారం. ఈ కార్యక్రమానికి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థల కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఈ సభలో హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగించనున్నట్లు కరపత్రాలు, ఇతర ప్రచార మార్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన కశ్మీర్లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను పాలస్తీనాలోని పరిస్థితులతో ముడిపెట్టి మాట్లాడవచ్చని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లో హైలెవెల్ భద్రతా సమీక్ష నిర్వహించారు. టెర్రరిజం కౌంటర్ ఆపరేషన్లను మరింత ఉధృతం చేయాలని, కశ్మీర్ వ్యాప్తంగా వాహన తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
గతంలో హమాస్, లష్కరే తోయిబా ఉగ్రవాదుల మధ్య సంబంధాలు నెలకొన్నట్టు పలు సమాచారాలు వెలుగుచూశాయి. 2024 ఆగస్టులో ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలు, లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 2018లోనే అమెరికా ఖలీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. హఫీజ్ సయీద్‌కు అతడు సన్నిహితుడిగా ఉండటంతో, ఈ కొత్త పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ పరిణామాలు కశ్మీర్ భద్రతా పరిస్థితిని మరింత సున్నితంగా మార్చే అవకాశముండటంతో, భారత ప్రభుత్వానికి ఇదొక సీరియస్ ఇష్యూగా మారింది. హమాస్, పాకిస్తాన్ ఆధ్వర్యంలోని ఉగ్రవాద సంస్థల కూటమి ఏర్పడుతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి.