గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ, హైద్రాబాద్ అభివృద్ధి ఘనత గురించిన చర్చ జరుగుతోంది. మా హయాంలో ఎయిర్ పోర్ట్ కట్టాం.. మా హయాంలో మెట్రో రైల్ తీసుకొచ్చాం.. మా హయాంలో ఐటీని అభివృద్ధి చేశాం.. అని వివిధ రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ప్రధానంగా హైద్రాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషించాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పటిదాకా అధికారంలో వున్నవి ఆ పార్టీలే గనుక.
ఐటీ క్యాపిటల్ ఘనత చంద్రబాబుదేనా.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తానే సైబరాబాద్‌ని నిర్మించానంటారు. ఆ ఘనత చంద్రబాబుదేనని ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కూడా చెప్పారు. ఆ సందర్భం వేరు. ‘హైద్రాబాద్‌కి మీరు ఏం చేశారు.?’ అని కేటీఆర్ పలు సందర్భాల్లో చంద్రబాబుని ప్రశ్నించారు. సైబరాబాద్ నిర్మాణం సరే.. ఆ సైబరాబాద్‌లోనూ కొన్ని అభివృద్ధి చెందని ప్రాంతాలున్నాయి.. హైద్రాబాద్‌లో మురికి కూపాలకు కొదవే లేదు. మరి, వీటి ఘనత ఎవరిది.?
కాంగ్రెస్ ప్రచారం అద్భుతః, కానీ..
మెట్రో రైల్ మేం తీసుకొచ్చాం.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మా ఘనతే.. అని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కనే వున్న గాంధీ భవన్‌కి ఆనుకుని వున్న మురికివాడల దుస్థితికి బాధ్యులెవరు.? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నేతలెవరూ సమాధానం చెప్పలేరుగాక చెప్పలేరు. కానీ, హైద్రాబాద్ అభివృద్ధి తామే చేశామంటూ గ్రేటర్ ఎన్నికల కోసం హంగామా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
కారుకే పట్టం.. కానీ, రోడ్లపై గుంతల సంగతేంటి పాపం.?
తెలంగాణ ఏర్పడి ఆరేళ్ళు దాటింది.. ఆరేళ్ళుగా టీఆర్‌ఎస్ అధికారంలో వుంది. గ్రేటర్ మేయర్‌గిరీ కూడా టీఆర్‌ఎస్‌దే ఇప్పటిదాకా. మరి, గ్రేటర్ హైద్రాబాద్‌లో సమస్యల మాటేమిటి.? మొన్నటికి మొన్న భారీ వర్షాలు కురిస్తే.. హైద్రాబాద్‌లో చాలా మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు. అంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. ఇంకోసారి తమకే ఓటేయాలని అంటున్న టీఆర్‌ఎస్, కారులో తమ రాజకీయ ప్రయాణం పరంగా హ్యాపీగానే వుందిగానీ.. రోడ్లపై గుంతల మాటేమిటి.?
హైద్రాబాద్ ఘనత ఆయా పార్టీలకు దక్కుతుంది.. అదే సమయంలో, హైద్రాబాద్ కష్టాల్లోనూ ఆయా పార్టీల వాటా వుంది. జనం ఎవరికి పట్టం కడతారు.? అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ, నేతలు చెప్పే మాటల్ని మాత్రం ఓటర్లు మైండ్‌లో పెట్టుకుంటారు ఖచ్చితంగా.