జీహెచ్‌ఎంసీ పోరు: ‘కప్పల తక్కెడ’ రాజకీయాలు షురూ!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ‘కప్పల తక్కెడ’ రాజకీయం మొదలైంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకీ నేతలు జంపింగులు చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల విషయంలో పరిస్థితి వేరు. స్థానిక ఎన్నికలు వేరు. పొద్దున్న ఒక పార్టీ, మధ్యాహ్నం ఇంకో పార్టీ, సాయంత్రం మరో పార్టీ అన్నట్లుంటుంది వ్యవహారం. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీలు పెద్దయెత్తున డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. గ్రేటర్‌ పరిధిలో రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఇదే తలనొప్పిగా మారింది.

ghmc elections latest news
ghmc elections latest news

కారుకి ఎదురే లేదు.. కానీ.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో తప్పకుండా ఎడ్జ్‌ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే వుంటుంది. 105 సీట్లు వస్తాయని కేసీఆర్‌ చెబుతున్నారుగానీ.. అందులో సగం వచ్చినా చాలు, మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దేనంటూ రాజకీయ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. సో, 50 సీట్లు సాధించడం టీఆర్‌ఎస్‌కి పెద్ద కష్టం కాదు. అయినాగానీ, ఛాన్స్‌ తీసుకోవడంలేదు టీఆర్‌ఎస్‌. సర్వశక్తులూ ఒడ్డేందుకు సమాయత్తమయ్యింది.

ghmc elections latest news
ghmc elections latest news

బీజేపీ పెద్ద షాకే ఇచ్చేలా వుంది..

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ని దెబ్బకొట్టిన బీజేపీ, అదే జోరు గ్రేటర్‌ ఎన్నికల్లో కొనసాగించాలనుకుంటోంది. అధికార పార్టీ నేతలకు గాలం వేస్తోంది. కొన్ని చేపలు ఇప్పటికే బీజేపీ వలలో పడ్డాయి కూడా. అయితే, అది గ్రౌండ్‌ లెవల్‌లో మాత్రమే. ఇంకా టైం వుంది.. నామినేషన్లు పడ్డాక అసలు కథ మొదలవుతుంది. కొనుగోళ్ళు తారాస్థాయిలో జరగనున్నాయి. అధికార పార్టీకి ఈ అడ్వాంటేజ్‌ చాలా ఎక్కువ. నిజానికి, ఇండిపెండెంట్లుగా పోటీ చేసేవారికి ఇలాంటి ఎన్నికలు పండగే.

ghmc elections latest news
ghmc elections latest news

కాంగ్రెస్‌, టీడీపీ.. ఆటలో అరటిపండులానే..

కాంగ్రెస్‌ నుంచీ, టీడీపీ నుంచీ కింది స్థాయి నేతలు ఆయా పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. అలాంటివారికి రేటు బాగానే పలుకుతోందట. విధిలేని పరిస్థితుల్లో ఆయా నేతల్ని కాంగ్రెస్‌, టీడీపీ బుజ్జగిస్తున్నాయిగానీ.. ఈ క్రమంలో ఖర్చు బాగానే చేయాల్సి వస్తోందట. ఇంతా ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా వాపోతున్నారు.అన్నట్టు, ఈసారి ఓటుకు నోటు రేటు కూడా బాగా పెరిగిపోయిందని సమాచారం. ఓటర్లు మారారు.. రాజకీయ పార్టీలు గట్టిగానే ఖర్చు చేయాలేమో. అటు నేతల్ని కొనడానికి ఖర్చు చేసి, మళ్ళీ ఓటర్లను కొనడానికి ఖర్చు చేయడమంటే.. పాపం రాజకీయ పార్టీలకు ఎంత కష్టమో కదా!