బీజేపీ యువ నేత తేజస్వి సూర్య, గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైద్రాబాద్ నగరానికి వచ్చారు. అయితే, ఈ రాకని టీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతమాత్రాన, ఆయన పర్యటన ఆగిపోతుందా.? ఆగదుగాక ఆగదు. కానీ, సోషల్ మీడియా వేదికగా టీఆర్‌ఎస్ అభిమానులు అత్యంత జుగుప్సాకరమైన భాషని వినియోగిస్తూ, తేజస్వి సూర్యపై విరుచుకుపడిపోయారు. రాయడానికి వీల్లేనంత దారుణమైన బూతు పదజాలాన్ని ఆయన మీద వాడుతున్నారు.
సోషల్ విషం ఈనాటిది కాదు.!
సోషల్ మీడియాలో బూతులు కొత్తేమీ కాదు. గతంలో సినీ తారల విషయంలో జుగుప్సాకరమైన భాష వాడేవారు నెటిజన్లు. ఇప్పుడు రాజకీయాలకూ అది అప్లయ్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా చెత్తని చాలా ఎక్కువగా చూశాం. అయితే, బూతు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం మాత్రం, గ్రేటర్ ఎన్నికలతోనే కావడం గమనించదగ్గ విషయం.
దేశవ్యాప్తంగా హైద్రాబాద్ పరువు పోతోంది..
హైద్రాబాద్ నగరానికి దేశవ్యాప్త గుర్తింపు వుంది. దురదృష్టవశాత్తూ గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ, ఈ బూతుల పంచాంగం కాస్తా, హైద్రాబాద్ పరువుని బజార్న పడేసినట్లయ్యింది. తేజస్వి సూర్య విషయంలో ఉపయోగిస్తోన్న బూతు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చాక, దాని అర్థం తెలుసుకోవడానికి గూగుల్ ట్రాన్సిలేటర్‌ని ఉపయోగిస్తున్నారు నెటిజన్లు. మరోపక్క, టీఆర్‌ఎస్‌పైనా బీజేపీ శ్రేణులు అంతకు మించిన జుగుప్సాకరమైన భాషని వాడుతున్నారు.
బూతులకి ఓట్లు పడతాయా.?
బీజేపీ, టీఆర్‌ఎస్.. ఇఫ్పుడు ఈ రెండు పార్టీలూ ప్రజల్లో పలచనైపోతున్నాయి. ఇంకా దురదృష్టకరమైన విషయమేంటంటే, తెలుగు నేల పరువు పోతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని సాధారణ ప్రజానీకం, ఈ తెలుగు బూతులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవడం పట్ల సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది.