సొంత జిల్లా చిత్తూరు నుంచి అసెంబ్లీకి తాను కాకుండా తన కుమారుడిని బరిలోకి దింపాలనే యోచన చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్, మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే. ‘కుమారుడిని గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు’ అనే అపప్రధను టీడీపీ అధినేత మూటగట్టుకున్నారు. నిజానికి, చంద్రబాబుని సైతం ఓడించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అప్పట్లో ఖచ్చితమైన వ్యూహాలే అమలు చేశారుగానీ.. చంద్రబాబు ఎలాగో గెలిచి తన పరువు నిలబెట్టుకున్నారు.
ఒకటి కాదు.. రెండు.. లోకేష్ డబుల్ బోనంజా
తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తోంటే, 2024 ఎన్నికల నాటికి టీడీపీ అభ్యర్థులు దొరుకుతారా.? లేదా.? అన్న ప్రశ్న ఓటర్ల మదిలో మెదలకుండా వుండదు. అందుకేనేమో, లోకేష్‌తో రెండు చోట్ల పోటీ చేయించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఒకటి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా వున్న చోట వుంటుందనీ, ఇంకోటి సొంత జిల్లా చిత్తూరు నుంచే వుంటుందనీ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, నారా లోకేష్ డబుల్ బోనంజా అన్న మాట. రెండిట్లోనూ గెలుస్తారా.? ఒక్కదాంట్లో అయినా గెలుస్తారా.? రెండిట్లోనూ ఓడిపోతారా.? అన్నది తేల్చాల్సింది ఓటర్లే.
టీడీపీ అధినేత పరిస్థితేంటి.?
2024 లోపు ఎన్నికలు వస్తేనే చంద్రబాబు ఎన్నికల బరిలోకి దిగుతారట. ఒకవేళ 2024 కంటే ముందు ఎన్నికలు రాకపోతే మాత్రం, 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేఉసే అవకాశాలు చాలా చాలా తక్కువంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి, 2019 ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా చంద్రబాబు చాలా ఇబ్బంది పడ్డారు. వయసు మీద పడ్తున్న దరిమిలా, ఆ ఎఫెక్ట్ చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై ఖచ్చితంగా పడి తీరుతుంది. ‘వయసు నా శరీరానికే.. నా మనసుకి కాదు..’ అంటూ పలుసార్లు చంద్రబాబు చెప్పుకున్నా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు ‘వృద్ధ’ వ్యూహాలు, పార్టీకి ఏమాత్రం ఊపు తెచ్చేలా లేవన్నది నిర్వివాదాంశం.
ఇదిలా వుంటే, గన్నవరం నియోజకవర్గం చుట్టూ తెలుగు తమ్ముళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి, వైసీపీ వైపు అడుగులేసిన దరిమిలా, ఉప ఎన్నిక తప్పనిసరైతే.. లోకేష్‌ని బరిలోకి దించాలనే ఒత్తిడి తెలుగు తమ్ముళ్ళ నుంచి అధినేతపై ఎక్కువగానే వుంది. కానీ, ఇంకోసారి ఓడిపోవడం ఇష్టం లేని లోకేష్.. గన్నవరం గురించి పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.