ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రాజకీయాలు స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడగా, ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమయ్యింది. ఎన్నికల సంస్కరణల్లో మార్పులు, ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం, కోర్టు జోక్యంతో, ఆర్డినెన్స్ కొట్టివేత.. మళ్ళీ పాత ఎన్నికల కమిషనర్ కొనసాగింపు.. ఇలా పెద్ద రగడే చోటు చేసుకుంది. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్ళీ స్థానిక ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభమయ్యే దిశగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని కోరారు.
ఎన్నికలకు ‘సై’, ఎన్నికల కమిషనర్‌తో బేటీకి ‘నై’
‘స్థానిక ఎన్నికలంటే భయం లేదు. గెలిచేది మేమే. కానీ, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా నిర్వహిస్తుండడాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకే, ఎన్నికల కమిషన్ పిలిచినా, సమావేశానికి మేం వెళ్ళలేదు..’ అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెబుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. దాంతో, వైసీపీ వైఖరిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి సాధారణ ప్రజానీకంలో.
అప్పుడు కరోనా భయం, ఇప్పుడు ఏదీ ఆ భయం.?
తక్కువ కేసులు వున్నప్పుడు రాష్ట్రంలో కరోనాని బూచిగా చూపి స్థానిక ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేసిన మాట వాస్తవం. కరోనా ఎంత భయంకరమైనదో చెబుతూ, కేంద్రం కూడా లాక్డౌన్ విధించింది.. అదీ తక్కువ కేసులు వున్నప్పుడే. కానీ, కేసుల సంఖ్య పెరిగాక అన్‌లాక్ షురూ అయ్యింది. దేశంలో ఇప్పుడు దాదాపు అన్నిటికీ మినహాయింపులు వచ్చేశాయి.. తిరిగి సాధారణ జనజీవనం కొనసాగుతోంది. అయినాగానీ, కరోనా భయం అయితే పోలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో స్థానిక ఎన్నికల్ని పోల్చి చూడగలమా.? అన్నది అసలు సిసలు ప్రశ్న. కాగా, స్కూళ్ళు తెరవడానికి సిద్ధమవుతున్నప్పుడు స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదు.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది.
అన్ని పార్టీలదీ ఒకటే నిర్ణయం.!
అన్ని రాజకీయ పార్టీలూ స్థానిక ఎన్నికల పట్ల కొంత సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌తో భేటీ అయిన పలు పార్టీలు, తమ తమ అభిప్రాయాల్ని చెప్పాకి. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు నిర్వహించాలని కొన్ని పార్టీలు కోరితే, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, కరోనా వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ఇంకొన్ని పార్టీలు సూచించాయి. వైసీపీ కూడా ఎన్నికలంటే తమకు భయం లేదంటోందిగానీ, కరోనా భయం ఇంకా తగ్గలేదు కాబట్టి.. సెకెండ్ వేవ్ వచ్చే అవకాశం వుంది కాబట్టి, ఎన్నికలు జరగడం ఇప్పుడప్పుడే మంచిది కాదని చెబుతోంది. కాగా, వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం తెప్పించుకున్నామని ఎస్ఈసీ చెబుతోంది. అంతే కాదు, చీఫ్ సెక్రెటరీతో కూడా సమావేశమైంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మరి, ప్రభుత్వాన్ని సంప్రదించడంలేదని వైసీపీ ఆరోపించడంలో మతలబు ఏంటో.?