ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వుండాలా.? వద్దా.? అన్న విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో కొంత గందరగోళం వుంది. ‘అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పింది..’ అని ఓ వైపు చెబుతూనే, ఇంకో వైపు, అమరావతికి సంబంధించి ఉద్యమించడానికి భారతీయ జనతా పార్టీతో కలిసి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత చెప్పడమేంటి? రాజకీయాల్లో ఇంతటి గందరగోళం కొనసాగిస్తూ, ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఎన్నాళ్ళు జనసేనాని చెలామణీ అవుతారు.!
అమరావతికి కులాన్ని ఆపాదించొద్దు: పవన్ కళ్యాణ్
అమరావతిలో వివిధ కులాలకు చెందినవారు, మతాలకు చెందినవారు వున్నారన్నది జనసేనాని ఉవాచ. అది నిజం కూడా. అయితే, అమరావతిలో అందరూ ఉద్యమించడంలేదు. కొన్ని గ్రామాల్లో కొందరు రైతులు మాత్రమే ఉద్యమిస్తున్నారు. వారంతా అమరావతి కోసం భూములు ఇచ్చినవారే కావడం గమనార్హం. వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారి ప్రాబల్యం ఎక్కువ కావడంతో, ఉద్యమంపై ‘కమ్మ’ ముద్ర పడింది. దీన్ని ఆసరాగా తీసుకుని, అధికార వైసీపీ.. అమరావతి ఉద్యమం చుట్టూ ‘రాజకీయ విమర్శలు’ చేస్తుండడం చాలా కాలంగా జరుగుతోంది.
జనసేనాని ఏం చేయగలరు.?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసేసుకుంది. అది చట్ట రూపం కూడా దాల్చింది. అయితే, హైకోర్టులో కేసుల నేపథ్యంలో ‘స్టేటస్ కో’ మాత్రమే వుంది. అంటే, స్టేటస్ కో గనుక ఎత్తివేయడమంటూ జరిగితే, మూడు రాజధానులకు మార్గం సుగమం అయినట్లే. కరోనా నేపథ్యంలో హైద్రాబాద్‌కే చాన్నాళ్ళుగా పరిమితమైపోయిన జనసేనాని, ‘ప్రభుత్వం అమరావతిని తరలిస్తామని అధికారికంగా చెప్పలేదు కదా..’ అనడం అస్సలేమాత్రం సమంజసంగా లేదు.
బీజేపీ కనుసన్నల్లో జనసేనాని
‘మేం ఏం చేయాలో మీరు రాతపూర్వకంగా ఇస్తే, దాన్ని మా మిత్రపక్షంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. రైతులు, జనసేనకు రిప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు.. దాన్ని మళ్ళీ రాతపూర్వకంగా కోరడమేంటి.? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా, మూడు రాజధానుల అంశంలో బీజేపీ ఎటూ తేల్చకపోవడం, జనసేనానిని సైతం గందరగోళంలోకి నెట్టేసినట్లుంది. ఆ అయోమయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.