కాపులకు 50 శాతం వాటా? కులాల మధ్య చంద్రబాబు కోటా చిచ్చు

 
 
బెల్లం చుట్టూ ఈగలు మూగి నట్లు ఎన్నికలు వచ్చే సరికి నేతలకు ప్రజలు గుర్తుకు వస్తున్నారు.ముందు వెనుక చూచు కోకుండా హామీల వర్షం కురిపిస్తున్నారు.  రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాము తీసుకొనే నిర్ణయాలు అమలు సాధ్యమా? లేదా కోర్టులో నిలుస్తాయా? లేదా? అనే విషయాలను పట్టించుకోవడం లేదు. అంతేకాదు. చేస్తున్న హామీలు అమలుకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుందా? లేదా? అని కూడా ఆలోచించడంలేదు.
 
ఈ నేపథ్యంలో అసందర్భమైనా ఒక అశం చెప్పాల్సి ఉంది. ఎపిలో వచ్చే మూడు నెలల కాలానికి 30 వేల కోట్లు అప్పు చేస్తేనే పూట గడుస్తుందట. వచ్చే రాబడి ఉద్యోగుల జీతాలకు సరిపోవడం లేదట. 12 వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో వున్నాయట. అయినా ఎన్నికల ఆపద గడిచేందుకు ముఖ్యమంత్రి ఇంకా రోజు కొక పథకం ప్రకటిస్తూ ఈ అప్పు అంతా అంతిమంగా ప్రజల పైననే పెట్టనున్నారు.
 
ముఖ్యమంత్రి కుటుంబానికి పలు కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీల్లో కూడా ఇలా అప్పులు చేసే విధానం అమలు చేస్తున్నారా? పాలు అమ్మ కాలకు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాని రాష్ట్రంలో తను సాధించిన ప్రగతి చాటేందుకు తగలబెట్టు తున్న విధంగా హెరిటేజ్ కంపెనీలో కూడా ప్రచారం కోసం ఆదాయానికి మించి వ్యయం చేయడం లేదు కదా? తను కేవలం ప్రజలకు ధర్మ కర్త మాత్రమే అనే అంశం మరచి పోవడమే అసలు లోపం. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఇలా వుంటే ప్రధాని మోదీకి సూటు బూటులు తప్ప ఇంత వరకు ప్రజలు గుర్తుకు రాలేదు. 2014 ఎన్నికలలో దేశ ప్రజలకు చేసిన హామీలు గాలికి పోయాయి. ప్రధానిమోదీ ఇంకా తమ బ్యాంకు ఖాతాలలో 15 లక్షలు జమ చేస్తారని (ఎన్నికల హామీ) వేచి చూచిన ప్రజలకు చిర్రెతు కొచ్చి మొన్న జరిగిన ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో ఓడించడంతో ప్రధానికి ప్రజల తత్వం బోధ పడింది. ఫలితంగా పలు రాయితీలు పథకాలు ప్రకటించు తున్నారు. అందులో భాగంగానే అగ్ర వర్ణాలలోని నిరుపేదలకు పది శాతం రిజర్వేషన్ ప్రకటించారు. ఇన్నాళ్లకు కొంత మేరకు న్యాయం జరిగిందని భావిస్తున్నా కోర్టుల్లో నిలబడదని కొందరు నిపుణులు చెబుతుంటే మరో పక్క ఆందోళన లేక పోలేదు. ఇది కోర్టుల్లో నిల్వ బడక పోతే మరి కొన్నాళ్లు అగ్ర కులాల నిరు పేదలు కష్టాలు పడక తప్పదేమో? .
ఎందుకంటే వెలమలు కమ్మ వారు రెడ్డులు ఇంకా పలు అగ్ర కులాలకు చెందిన అందరూ సంపన్నులు కాదు. వీరిలో చాలామంది దరిద్రులు వున్నారు. దళితులు సామాజికంగా వెనుకబడి వున్నా వారిలోని కొందరి కన్నా అగ్ర వర్ణాలలోని కొందరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.ఈ లాంటి వారిని ఆదుకొనేందుకు ఏ ఉద్దేశంతో నైనా ప్రధాని ఈ పథకం ప్రకటించితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి ఎసరు బెట్టి రాష్ట్రంలో కులాల కుంపటి రగిలించేందుకు సిద్ధ మౌతున్నారు.
 
వాస్తవంలో ఇది వరకే కులాల రిజర్వేషన్ల చిచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు రగిలించారు. 2004 లో ఎదురైన ఓటమి నుండి బయట పండేందుకు అమలు జరుగు తాయా? లేదా అనే అంశాలు పరిగణనలోనికి తీసుకోకుండా పాదయాత్ర సందర్భంగా కాపులకు బోయలకు మత్స్య కారులకు రజకులకు తామర తంపరగా రిజర్వేషన్ల హామీలు ఇచ్చారు. తీరా అమలు జరిగే సమయంలో ముఖ్యమంత్రి అనుసరించిన అస్త వ్యస్త వైఖరితో బిసిలు కాపుల మధ్య చిచ్చు రగిలింది.ఈ సంక్షోభం నుండి బయట పండేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక పోయినా మరి కొన్ని పథకాలు అమలు చేయ వలసి వస్తోంది. దీనికి తోడు రాజకీయ అవినీతి వెర్రి తలలు వేయడంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చిలక కొట్టుడులు ఎక్కువై అసలు లక్ష్యం నీరు గారి పోతోంది. దీనికి తోడు అసంబద్ధ మైన పద్దతిలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ కల్పించుతూ శాసన సభలో చట్టం ఆమోదించి కేంద్రంకు పంపారు. దురదృష్టకరమైన అంశమేమంటే ఎపి యెడల కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం దానిని మూల బడేసింది. ఫలితంగా కాపులకు అన్యాయం జరగడం ఎంత వాస్తవమో చంద్రబాబు అనుసరించిన విధానం వలన బిసిలకు కాపుల మధ్య తలెత్తిన రగడ నివారించ బడటం అంతే వాస్తవం. లేకుంటే అవాంఛనీయ మైన పరిస్థితి చవి చూడ వలసి వుండేది. 
 
కాపులకు బిసిల మధ్య చిచ్చు రేగి తుదకు బాహాబాహీ పోరాటం నివారింప బడిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ అంశంలో తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు తల దూర్చి కులాల మధ్య చిచ్చుకు తల పడుతున్నారు..రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా తెగించు తున్నారు. రోజుకొక భాష్యం చెబుతున్నారు. ఎవరైనా తన భాష్యంపై భిన్నంగా మాట్లాడితే వైసిపి బిజెపి పార్టీలను ముందుకు తెచ్చి ఎదురు దాడికి దిగుతున్నారు. ఎపికి శనిరోజులు ఇప్పట్లో వదిలేటు లేదు. ముఖ్యమంత్రి తన అసంబద్ధ విధానాలను ప్రశ్నించే వారినంతా అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేసి తన పరివారం చేత ఎదురు దాడి చేయించి సమస్యను పక్కదారి పట్టించు తున్నారు. ప్రతి పక్షానికీ వుండే బలహీనతలపై తన అసంబద్ధ వైఖరిని దాచు కొంటున్నారు. 
 
ప్రస్తుతం కేంద్రంఆమోదించిన పదిశాతం రిజర్వేషన్ లో అయిదు శాతం కాపులకు కేటాయించుతానని చెబుతున్నారు. ఎవరైనా దీనిని వ్యతిరేకించితే వారిని కాపుల ముందు ముద్దాయిగా నిలబెట్టే కుటిల యత్నానికి తలపడు తున్నారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వింత వాదన తెచ్చారు. రాష్ట్రంలో అగ్ర వర్ణాల నిరుపేదలలో 50 శాతం మంది కాపులు వున్నారని చెప్పారు. ఈ వాదనకు అనుకూలంగా గణాంకాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయించిన ప్రామాణిక నివేదికలు ఏమీ లేవు. ముఖ్యమంత్రి ఏది అనుకుంటే అది మనం నమ్మాలి. ఫలితంగా గతంలో కాపులకు బిసిలకు మధ్య చిచ్చు పెట్టి నట్లు ప్రస్తుతం కాపులకు అగ్ర వర్ణాలలోని నిరుపేదల మధ్య రగడ సృష్టించ బోతున్నారు.
 
ఈ అంశంలో మరో ట్విస్ట్ అడ్డంకి వుంది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ కల్పించుతూ శాసన సభలో ఆమోదించి చట్ట రూపంగా కేంద్రానికి ఒకవేపు పంపి అది పెండింగ్ లో వుండగా మరో వేపు అగ్ర వర్ణాలలోని నిరుపేదలకు కేంద్రం కలిగించిన పదిశాతంలో ఏకంగా అయిదు శాతం కాపులకు ఏలా అమలు జరుపుతారు.? అసలు కేంద్ర అమలు జరుపుతున్న పదిశాతం రిజర్వేషన్ కోర్టుల్లో నిలవదనే వాదనలు వుండగా ముఖ్యమంత్రి అయిదు శాతం కాపులకు ఏలా ఇవ్వ గలరు.? ఇంతకీ శాసన సభ ఆమోదించిన చట్టం వుండగామరో చట్టం ఏలా ఆమోదించుతారు? దానిని రద్దు చేసి కొత్త చట్టం చేస్తారా? లేక పరిపాలన అనుమతి ఇచ్చి చేతులు దులుపుకుంటారా? దీనిపై ఎవరైనా కోర్టులకు వెళితే తనేదో చేయాలంటే ప్రతి పక్షాలు అడ్డు పడుతున్నాయనే పాత పాట పాడి తెర దించు తారా? ముఖ్యమంత్రి పరిపాలనలో ఇవన్నీ యక్ష ప్రశ్నలే. ఎన్నికల గండంగడిచేండుకు సామాజిక సమతుల్యంపై ముఖ్యమంత్రి తన చేతికి దొరికిన రాళ్లు విసిరితే అవే తిరిగి ఆయనకే తగలక తప్పుదు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ వైఖరి వలన మున్ముందు కాపులకు ఇతర అగ్ర కులాల నిరుపేదల మధ్య తగాదాలకు బిజం  వేస్తున్నారు. కాపులకు న్యాయం జరగ వలసినదే. ఇతర రాష్ట్రాల్లో వున్న విధంగా మనం సాధించాలి. లేదా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఎపికి ప్రత్యేక హోదా ఇస్తారని ప్రచారం చేసి ఎపి ప్రజలను నమ్మించేందుకు విఫల యత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేపు రాహుల్ గాంధీ చేతనే రెండవ సంతకం చేయించి కాపు రిజర్వేషన్ అమలు చేస్తానని ఎందుకు చెప్పకూడదు.? ఈ లోపు అందరి పేదలతో సమానంగా కాపుల లోని నిరుపేదలకు రిజర్వేషన్ అమలు జరిపితే కులాల మధ్య చిచ్చు నివారించ వచ్చు కదా?
 
ముఖ్యమంత్రి కి వాస్తవంలో రిజర్వేషన్ అమలు కాదు-కావలసినది ఏమంటే కాపులు గంప గుత్తుగా టిడిపి కి ఓట్లు వేసి మరో మారు ముఖ్యమంత్రి పదవి కట్ట బెట్టడమే. దానిని కూడా ఒక చారిత్రక అవసరంగా ఇప్పటికే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడు ఏది అవసరమైనా అప్పటికి అది చారిత్రక అవసర మౌతుంది.ఈ ఊత పదం కొన్ని సందర్భాల్లో నవ్వులాటగా తయారౌతోంది. తెలంగాణలో కాంగ్రెస్ తో జట్టు కట్టడం ఆనాడు ఒక చారిత్రక అవసరం కాగా ఈనాడు ఎపిలో కాంగ్రెస్ కు తిలోదకాలు ఇవ్వడం మరో చారిత్రక అవసరమని మున్ముందు చెబుతారేమో. తుదకు తన విధానాల వలన రాష్ట్రంలో కులాల కుమ్ము లాటలు తలెత్తితే అదికూడ ఒక చారిత్రక ఆవశ్యకత అంటారేమో.
 
 
(వి. శంకరయ్య, సీనియర్ జర్నలిస్టు ఫోన్ నెం 9848394013)