(ఎం పురుషోత్తమ్ రెడ్డి)
సుప్రీం కోర్టు తీర్పు కారణంగా కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వలేమని, కానీ వారి పురోబివృద్దికి అన్ని విధాలా తోట్పాటు అందిస్తామని YSRCP అధినేత విపక్షనేత కూడా అయిన జగన్ ప్రకటించడంతో రాష్ట్రంలో సామాజిక కోణంలో రాజకీయ చర్చ ప్రారంభమయినది. బాబులాగా తాము మాట ఇచ్చి తప్పలేమని నష్టం వచ్చినా నిజాయితీగా ఉంటామని వైసిపి , ఇపుడే ఆ విషయం తెలిసిందా అనిటిడిపి , మీ పరిధిలో లేని ప్రత్యేకహోదాను మాత్రం సాధిస్తామని చెపుతున్న మీరు కాపుల విషయంలో మాత్రం అందుకు బిన్నంగా ఎందుకు మాట్లాడుతున్నారని ముద్రగడ ప్రశ్నించడం చక, చక జరిగిపోయింది. జగన్ ప్రకటనను రాజనీతిలో కోణంలో చూడాలా? విలువలకు సంబంధించిన కోణంలోనా ? అంటే కచ్చితంగా రాజనీతి కోణంలో అని చెప్పక తప్పదు.
అధికారమే లక్ష్యంగా ప్రజలను నమ్మించడానికి ఎన్ని మాటలన్నా చెప్పవచ్చు, మోసం చేయవచ్చు. ఏమి చేసినా జనం నమ్మడమే ప్రాతిపదిక తప్ప అమలు చేస్తామా ? చేయమా ? అన్నది కాదు. అలా జనాన్ని నమ్మించగలిగినవాడే మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అని సుప్రసిద్ద రాజనీతి పండితుడు మాకియావెల్లి అంటాడు. వారి మాటలు తప్పుగా ఉన్నా ఆధునిక రాజకీయాలను నిశితంగా గమనించినవారికి మాకియావెల్లి మాటలు నిజమే కదా అనిపిస్తుంది.
ఇక జగన్ ప్రకటనను రాజనీతి కోణంలోనే చూడాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా రాష్ట్రంలోని జనం పార్టీల చుట్టూ సామాజిక తరగతులుగా సమీకరించబడి ఉన్నారు. కాపులు, మరి కొన్ని సామాజిక తరగతులు ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలకు ఓటు వేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ ఆశ చూపడం, పవన్ బలపరచడం వలన ఆ సామాజిక తరగతి టిడిపి వైపు మొగ్గుచూపింది. పలితంగా టిడిపి అధికారంలోకి వచ్చింది. నాడు కాపులకు ఇచ్చిన హమీ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండు చేస్తూ ముద్రగడ దశలవారిగా పోరాటం చేసినారు. ముద్రగడ పోరాటం చేసిన ప్రతి సందర్బంలో వైసీపీ వారికి దన్నుగా నిలిచింది. అలా కాపులకు దగ్గరకావడం, హమీ ఇచ్చి అమలు చేయలేక పోయిన అధికారపార్టీకి కాపులను దూరం చేయడం లక్ష్యంగా ప్రతిపక్ష వైసిపి పని చేసింది.
కొన్ని నెలల ముందువరకు పవన్ బాబుతోనే ఉన్నారు. పవన్ బాబుతోనే ఉన్న కారణంగా పవన్ చెప్పినా కాపులు వినరన్న అంచనాతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ నేడు వైసిపికి టిడిపి కి దూరంగా స్వతంత్రంగా రాజకీయాలు చేస్తున్నారు. పవన్ తనకు కులం పట్ల పట్టింపులు లేవని, తాను మతం, కులంకు దూరంగా ఉంటానని చాలా స్పష్టంగానే మాట్లాడారు. అంతే కాదు ముద్రగడ దీక్ష సందర్బంగా కూడా పవన్ వారిని గట్టిగా బలపరచలేదు. వైసిపి, టిడిపి లను రెండు సామాజిక తరగతులవారు తమ పార్టీగా బావిస్తున్న పరిస్థితులలో పవన్ వైపు కాపులు నిలబడటాన్ని తప్పు పట్టలేము.
అధికారపార్టీని, జనసేనను ఒకే ప్రకటనతో టార్గెట్ చేసిన జగన్
కాపులకు రిజర్వేషన్ ఇప్పించలేమని జగన్ ప్రకటన కేవలం విశ్వసనీయతకు మాత్రమే సంబంధించిన విషయంగా చూడలేము. ఒక ప్రకటనతో ఇరువురుని జగన్ టార్గెట్ చేసినారనక తప్పదు. రెండు టార్గెట్లు ఇవి:1. జగన్ ప్రకటనకు పవన్ వెంటనే స్పందించి ఉంటే పవన్ కాపుల అనుకూలమని ముద్ర వేయవచ్చు, అపుడు కాపు రిజర్వేషన్ల ను వ్యతిరేకించే కొన్ని సామాజిక తరగతుల వారికి తాను దగ్గరకాచ్చు.2. అట్లే తెలుగుదేశం తాము ఇచ్చి తీరుతామని ప్రకటించి జగన్ ను విమర్సిస్తే అపుడు టిడిపి వెనక ఉన్న బీసీ తరగతులలో కొందరిని తమ వైపు ఆకర్షించవచ్చు. ఇది జగన్ వ్యూహంగా అనిపిస్తుంది.
జగన్ వ్యూహ ఫలితం ఎలా ఉంటుంది
జగన్ ప్రకటన వెంటనే స్పందించే పవన్, చంద్రబాబులు ఈ విషయంలో స్పందించలేదు. అధికారపార్టీ జగన్ ను విమర్శించినా కూడా దాని తీవ్రత మునిపటిలాగా లేదు. పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. జగన్ ప్రకటనను కాపులు వ్యతిరేకిస్తుంటే బీసీలు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు అంటే జాగ్రత్తగా గమనిస్తున్నారని పిస్తుంది.
మిగిలిన సామాజిక తరగతుల వారు తమకు సంబంధంలేని విషయంగానే చూస్తున్నారు. అంతేకాదు, జగన్ కాపుల విషయంలో తీసుకున్న వైఖరిపై పార్టీలు బయట విలువలు, విశ్వసనీయతల గురించి గొప్పగా చెప్పుకుంటున్నా లోపల మాత్రం రాజకీయ లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నాయి.
రాజనీతితో తీసుకునే నిర్ణయాలలో ఉండేది కూడికలు తీసివేతలు మినహ మంచి చెడ్డలకు స్థానం ఎపుడూ ఉండదు.
(రచయిత ఎం పురుషోత్తంరెడ్డి రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్. ఫోన్ 9490493436)