ఏపీలో విపక్షాలు మరీ రెచ్చిపోయి విమర్శలు చేస్తున్న వేళ… జగన్ సైతం దూకుడు పెంచారు. మాటల్లో వాడి, విమర్శల్లో వేడి పెంచారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ పై తీరస్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజాన్ని చీల్చేందుకే వారాహి యాత్ర చేస్తున్నారని చెబుతూ… పవన్ పెళ్లిళ్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
జగనన్న అమ్మ ఒడి పథకం కింద నగదు జమ చేయడానికి తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. “పవన్ కళ్యాణ్ లా మనం భార్యలను మార్చలేం” అంటూ నిప్పులు చెరిగారు. ఆయనలా రౌడీ మాదిరిగా తొడ కొట్టలేమని.. బూతులు తిట్టలేమని.. నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యలనూ మార్చుకోలేమని జగన్ ఎద్దేవా చేశారు.
అనంతరం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా విమర్శించలేదని గుర్తు చేసిన జగన్.. ఇప్పుడు ఒక లారీ ఎక్కి దానిపై ఊగిపోతూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటున్నాడు.. తాట తీస్తా, గుడ్డలు ఊడదీసి కొడతా అంటూ కామెంట్లు చేస్తున్నాడని దుయ్యబట్టారు. దీంతో జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!
అనంతరం బాబువైపు స్టీరింగ్ తిప్పిన జగన్… ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు తాము ఇంత మేలు చేస్తుంటే 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి.. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమపై విమర్శలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కోసమే 15 ఏళ్ల క్రితం ఓ దత్తపుత్రుడు ఆవిర్భవించాడని ధ్వజమెత్తారు.
అనంతరం 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచీ చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు.. ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. అంటూ జగన్ సెటైర్స్ వేశారు.