రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదు.. అని అనడం సబబు కాదు. ఎందుకంటే, ఇక్కడ నిప్పు లేకపోయినా పొగ వచ్చే ఛాన్స్ వుంటుంది. ఆ పొగ ఆ తర్వాత నిప్పుకి కారణమవుతుంటుంది. అదే రాజకీయం అంటే. ఉత్తరాంధ్రకు సంబంధించినంతవరకు మంత్రి బొత్స సత్యనారాయణ బలమైన నాయకుల్లో ఒకరు. వైఎస్ హయాంలో బొత్స సత్యనారాయణ చక్రం తిప్పారు. వైఎస్ మరణానంతరం కూడా కాంగ్రెస్‌లో బొత్సకు మంచి ప్రాధాన్యత దక్కింది. కానీ, ఆ తర్వాతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. తిట్టిన నోటితోనే వైఎస్ జగన్‌ని పొగడాల్సి వచ్చింది.. వైఎస్ జగన్ పంచన చేరాల్సి వచ్చింది.
వైసీపీకి బొత్స ఎదురుతిరుగుతారా.?
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. గతంలో దక్కిన ప్రాధాన్యత ఇకపై దక్కదని తెలుసుకుంటే, తమ జాగ్రత్తల్లో తాము వుండాలనే నిర్ణయానికి వచ్చేస్తారు నేతలు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు అదే ఆలోచనతో వున్నారంటూ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా బొత్సకి వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదన్నది ఆ చర్చల తాలూకు సారాంఫశం. అయితే, కీలకమైన అంశాల్లో బొత్స సత్యనారాయణకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నారు వైఎస్ జగన్. దీన్ని సైతం కొందరు ప్రత్యేక కోణంలో చూస్తూ, ‘బొత్స భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చుతున్నారు..’ అన్న విమర్శ చేస్తున్నారు.
బొత్సకి వేరే ఛాన్స్ ఏముంది.?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులున్నాయి. సహజంగానే అధికార పార్టీ పట్ల కొంత వ్యతిరేకత గ్రౌండ్ లెవల్‌లో కనిపిస్తుంటుంది. దాన్ని విపక్షాలు క్యాష్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, విపక్షాలు.. అధికార పార్టీకి ధీటుగా సత్తా చాటే పరిస్థితి కనిపించడంలేదు. దాంతో, బొత్స కావొచ్చు.. మరో నాయకుడు కావొచ్చు.. ఒకవేళ అధికార పార్టీలో ఇమడలేకపోతే, వారికి మరో పార్టీ కనిపించని పరిస్థితి.
అసలంటూ బొత్సకి ఆ అసహనం వుందా.?
వైసీపీ ప్రభుత్వంలో వున్న సీనియర్ నేతల విషయానికొస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు దాదాపుగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వున్నారు. చాలా కీలక విషయాల్లో ఈ ఇద్దరూ కనిపిస్తున్నారు. అలాంటప్పుడు బొత్సకి అసహనం ఏముంటుంది.? ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి పెత్తనం నచ్చక బొత్స అసహనానికి లోనవుతున్నారనే విమర్శ వున్నా.. ఆ విషయమై బొత్స చర్యలేమీ అంత అనుమానాస్పదంగా ఇప్పటిదాకా కనిపించలేదు.