అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడయ్యారు బండి సంజయ్. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన పరిణామం. సీనియర్లను పక్కన పెట్టి, బండి సంజయ్‌కి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేయడం పట్ల అప్పట్లో చాలా చర్చ జరిగింది. అయితే, ఆ తర్వాత అంతా సర్దుకుపోయారు. అయితే, గ్రేటర్ ఎన్నికల వేళ, బండి సంజయ్ వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బండి సంజయ్ దూకుడు వర్కవుట్ అయ్యింది.. ఆ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు వెనుక రఘునందన్ కృషి చాలా చాలా ఎక్కువ. అయితే, గ్రేటర్ ఎన్నికల విషయంలో మాత్రం బండి సంజయ్ అత్యుత్సాహం బీజేపీ కొంప ముంచుతోందని సీనియర్లు వాపోతున్నారు.
మతం తప్ప, ఇంకో మాట లేదా.?
‘బస్తీ మే సవాల్’ అంటూ పాత బస్తీ భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు కేసీఆర్‌ని ఆహ్వానించారు బండి సంజయ్. అయితే, ఆ సవాల్‌కి కేసీఆర్ ‘సై’ అనలేదనుకోండి.. అది వేరే సంగతి. ఈ ఎపిసోడ్‌లో కొంతవరకు బండి సంజయ్ ఇమేజ్ పెరిగినా, కేసీఆర్‌కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనడం ద్వారా, బండి సంజయ్ బీజేపీ ఓటు బ్యాంకుకి తనంతట తానుగా గండికొట్టుకున్నట్లయ్యింది. ఈ తరహా వ్యాఖ్యల్ని సభ్య సమాజం హర్షించే పరిస్థితి వుండదు.
జనసేనతో బెడిసికొట్టింది బండి సంజయ్ కారణంగానే..
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేసి వుంటే.. సీట్లు పంచుకుని వుంటే, ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఇరు పార్టీలకీ, మరీ ముఖ్యంగా బీజేపీకి వుండేది. ‘పొత్తుల చర్చల్లేవ్..’ అని బండి సంజయ్ అత్యుత్సాహంతో ముందే ప్రకటించడానికి బీజేపీ అధినాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మిత్రపక్షం జనసేన వద్దకు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లను పంపింది అధిష్టానం. జనసేనానిని ఈ విషయంలో బీజేపీ అధిష్టానం కూడా బుజ్జగించిందట.
బండి సంజయ్‌కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కిషన్‌రెడ్డి.?
గ్రేటర్ రాజకీయాల పరంగా బండి అత్యుత్సాహంపై కిషన్‌రెడ్డి నీళ్ళు చల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజాసింగ్ ఎపిసోడ్‌లోనూ, మరో విషయంలోనూ బండి సంజయ్ తీరు కిషన్‌రెడ్డి సహా బీజేపీలో ఇతర ముఖ్య నేతలకు అస్సలేమాత్రం నచ్చడంలేదు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి మౌనంగా వున్నా.. ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్‌కి సొంత పార్టీ నుంచి ‘పోటు’ తప్పకపోవచ్చంటున్నారు. అత్యుత్సాహం ఎప్పుడూ కొంప ముంచేస్తూనే వుంటుంది.. బండి సంజయ్‌కీ ఆ పోటు తప్పదు మరి.