అంశాల వారీగా కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతిస్తూ వచ్చింది. జీఎస్టీ విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. బీజేపీని జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్ మిత్రపక్షంగానే చూసింది. కానీ, ఇప్పుడేమయ్యింది.? గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ – బీజేపీ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఈ స్థాయిలో బీజేపీ తెలంగాణలో బలపడిందంటే, అది తెలంగాణ రాష్ట్ర సమితి స్వయంకృతాపరాధమే. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏ తప్పు చేశారో, బీజేపీతో తెరవెనుకాల ఒప్పందాలతో కేసీఆర్ కూడా అంతకన్నా పెద్ద తప్పే చేశారన్నది నిర్వివాదాంశం. చంద్రబాబు, కేసీఆర్ మాత్రమే కాదు.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నారా.? గడచిన ఏడాదిన్నర కాలంగా బీజేపీతో వైసీపీకి తెరవెనుకాల నడుస్తున్న ‘అవగాహన’, ముందు ముందు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి తీరని నష్టం చేస్తుందా.? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా నడిచిన రాజకీయం దెబ్బకి టీఆర్‌ఎస్ మైండ్ బ్లాంక్ అయిపోతోంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లోనూ అదే దెబ్బ రిపీటవుతుందా.? అని టీఆర్‌ఎస్ శ్రేణులు వణికిపోతున్నాయి. హైద్రాబాద్‌లో బీజేపీ జోరు చూసి, వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ దారెటు.?
వైసీపీ గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. కానీ, ఆ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు వుంది. మరి, ఆ ఓటు బ్యాంకు ఎటు వైపు వెళుతుంది.? అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న. టీఆర్‌ఎస్ వైపే వైసీపీ ఓటు పడుతుందనే చర్చ జరుగుతున్నప్పటికీ, ఆ ఓటు ఖచ్చితంగా చీలిపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క, మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామనీ, కొన్ని డివిజన్లలో అయినా వైసీపీ పోటీ చేసి వుండాల్సిందనీ, కనీసం టీఆర్‌ఎస్‌తో అవగాహనతో నాలుగైదు సీట్లు గెలుచుకున్నా బాగుండేదనీ వైసీపీ నేతలు, అధిష్టానం వద్ద వాపోతున్నారట. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, టీఆర్‌ఎస్‌తోపాటు వైసీపీకి కూడా గట్టి దెబ్బ తగలబోతోంది. ఎందుకంటే, ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనా పడుతుంది కాబట్టి.
తెలంగాణ రాజకీయాల్ని ఏపీ రాజకీయాలతో పోల్చగలమా.?
రాజకీయాలు ఎక్కడైనా ఒకటే. చిన్న చిన్న ఈక్వేషన్స్‌లో మార్పులుంటాయేమో తప్ప, బీజేపీ వ్యూహాలు మాత్రం అన్ని చోట్లా ఒకేలా ఫలితాలు ఇచ్చే అవకాశముంది. గడచిన కొన్నేళ్లుగా దేశంలో విస్తరిస్తున్న తీరు చూశాక అయినా, వైసీపీ జాగ్రత్త పడి వుండాల్సిందన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ. చెప్పి మరీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. తమిళనాడులో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయబోతోన్న విషయం విదితమే. కర్నాటకలో బీజేపీనే అధికారంలో వుందిప్పుడు. తెలంగాణలోనూ సత్తా చాటితే, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా బీజేపీ దృష్టి వైసీపీ మీద పడుతుంది. టీడీపీని దెబ్బ కొట్టి బీజేపీకి, వైసీపీని దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరంపై మొండి చెయ్యి చూపుతున్నా.. కేంద్రాన్ని వైసీపీ నిలదీయడంలేదాయె. భవిష్యత్తులో ఇది వైసీపీకి పెద్ద సమస్యగా మారే అవకాశముంది.
మా వ్యూహాలు మాకున్నాయంటున్న వైసీపీ
రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని ఓ పెద్ద పార్టీగా రాష్ట్రంలో చూడటం లేదన్నది వైసీపీ వాదన. ‘ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతమెంత.? వారు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవమెంత.?’ అని వైసీపీ నేతలు రోజా తదితరులు ఎద్దేవా చేస్తున్నప్పటికీ, తమ వ్యూహాలు తమకుంటాయని ఆ పార్టీ గట్టిగా చెబుతున్నప్పటికీ.. తిరుపతి ఉప ఎన్నిక లాంటి సందర్భమొక్కటి చాలు.. ఏపీలో రాజకీయాలు తారుమారైపోవడానికి.