బీజేపీ మహాధర్నా డిమాండ్లు… వెనక్కి తగ్గొందంటున్న నిరుద్యోగులు!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై బీజేపీ చేపట్టిన “నిరుద్యోగ మహా ధర్నా” మార్చి 25వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ఘనంగా ప్రారంభమైంది. నిరుద్యోగులతో కలిసి చేపట్టిన ఈ ఉద్యమంలో పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బీజేపీ నేతలు… “పేపర్ లీకేజీలతో అన్నీ పరీక్షలు రద్దు చేశారని.. ఫలితంగా 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని” ఆవేదన వ్యక్తం చేశారు!

ఈ క్రమంలో ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు బీజేపీ నేతలు. అవి పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు! ప్రస్తుతం ఈ డిమాండ్లు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లు పరిష్కరిస్తుందా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది!

టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి కారణమైన మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. అంతేకాకుండా… పేపర్ లీకుల్లో కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక.. పేపర్ లీకేజీపై సిట్ విచారణ సరిపోదని.. సిట్ పై నమ్మకం లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది మరో డిమాండ్ గా ఉంది. ఇదేక్రమంలో… మరో ప్రధానమైన, కీలకమైన డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. అదేమిటంటే… పరీక్షలు రాసి నష్టపోయిన అభ్యర్థులు, నిరుద్యోగులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని!

అవును… ఉద్యోగాలు వదిలేసి.. సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకున్నారని, ఇప్పుడు పరీక్ష పేపర్ల లీకేజీ వల్ల అందరూ నష్టపోయారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తెలిపిన బీజేపీ నేతలు… అభ్యర్థులు అందరికీ, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు! దీంతో.. ఈ డిమాండ్ పై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమా అని ఆన్ లన్ వేదికగా కొందరంటుంటే… కచ్చితంగా సాధ్యమే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు! కాకపోతే… ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేవరకూ బీజేపీ నేతలు వెనక్కి తగ్గకూడదని, ఆ డిమాండ్ ఒక్కరోజు ముచ్చటగా ముగిసిపోకూడదని, ఈ డిమాండ్లను సాధించేవరకూ బీజేపీ నేతలు తమకు తోడుండాలని, మోసం చేసి వెనక్కి మల్లకూద్డదని బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు!

ఆ డిమాండ్ల సంగతులు అలా ఉంటే… మరోపక్క ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆరోపణలు చేస్తున్న నాయకులకు సిట్ నోటీసులు పంపిస్తోంది. బండి సంజయ్ కి కూడా గతంలోనే సిట్ నోటీసులు పంపించింది. 24వతేదీ విచారణకు రావాలని చెప్పింది. అయితే అసలు తనకు నోటీసులే రాలేదని, అందుకే తాను విచారణకు రావట్లేదని చెప్పిన బండి.. అయినా తనకు పార్లమెంట్ సమావేశాలున్న సమయంలో విచారణకు ఎలా రావాలని ఎదురు ప్రశ్నించారు. దీంతో సిట్ మరోసారి బండికి నోటీసులిచ్చింది. ఈనెల 26న విచారణకు రావాలని పిలిచింది.