రెండో తిరుమలగా అమరావతి, టిటిడి సంచలన నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని  అమరావతి రెండో తిరుమలగా మారనుంది. అక్కడ బ్రహ్మాండమయిన శ్రీవేంకటేశ్వర ఆలయం నిర్మాణమవుతుంది. అమరావతిలో ఈ భారీ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని   తుళ్లూరు మండలం వెంకటపాళెం వద్ద ఈ ఆలయం నిర్మిస్తారు. దీనికోసం రూ.150 కోట్లు ఖర్చు చేయాలని బోర్డు నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలలో మరొక  శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణం చేపట్టాలని ఇదే ప్రథమం. ఇంతవరకు ఆలయాల మరమ్ముతులు, కల్యాణమంటపాల నిర్మాణానికే పరిమితమయిన టిటిడి తిరుమల క్షేత్రం ఉన్న రాష్ట్రంలోనే ఇంత భారీగా మరొక ఆలయం నిర్మించాలనుకోవడం ఆశ్చర్యం.

 టిటిడి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  ఇంకా అనేక ముఖ్యమయిన  నిర్ణయాలు తీసుకున్నారు.

– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.79 కోట్లు మంజూరు.

– సనాతన ధర్మప్రచారంతోపాటు శ్రీ వేంకటేశ్వరతత్వాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా 2,200 టిటిడి ఆధ్యాత్మిక ప్రచురణలను ఆంధ్రప్రదేశ్‌లోని 142 గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా.

– 2015 సవరించిన పిఆర్‌సి ప్రకారం టిటిడి రవాణా విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు నెలవారీ వేతనం రూ.15 వేల నుండి రూ.24,500/-లకు, 28 మంది క్లీనర్లకు నెలవారీ వేతనం రూ.12 వేల నుండి రూ.18 వేలకు పెంచడం జరిగింది.

– తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌, టి, టిఫిన్‌ సెంటర్లలో ఆహారపదార్థాల ధరలను సమీక్షించేందుకు ఐదుగురు టిటిడి అధికారులతో కమిటీని(ఎస్టేట్‌ అధికారి అధ్యక్షుడిగా, క్యాటరింగ్‌ అధికారి, ఆరోగ్యాధికారి, ముఖ్య గణాంకాధికారి సభ్యులుగా, తహసీల్దార్‌ సమన్వయకర్తగా) ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీ నివేదిక రూపొందించి బోర్డుకు సమర్పిస్తుంది.

– తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవాసదన్‌-1, 2 భవనాలు, వకుళాదేవి విశ్రాంతిగృహం, పిఏసి-3 కలిపి 3 సంవత్సరాలకు గాను ఎఫ్‌ఎంఎస్‌ నిర్వహణ కోసం రూ.19.50 కోట్లతో టెండర్లు ఖరారు.

– కడప జిల్లా ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖకు అప్పగింత.

– తిరుపతిలో టిటిడి భవనంలో గల రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం లైసెన్సు కాలపరిమితిని 01-09-2018 నుండి 31-08-2021 వరకు 3 సంవత్సరాలు పొడిగింపునకు ఆమోదం.

– ఆంధ్రప్రదేశ్‌లోని టిటిడి కల్యాణమండపాల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.37.05 కోట్లు మంజూరుకు ఆమోదం.

– టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో ఏర్పాటుచేస్తున్న గోశాల మొదటి దశ నిర్మాణపనులకు గాను సబ్‌ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

– గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురం వద్దగల టిటిడి కల్యాణమండపాన్ని స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థాన అభివృద్ధి కమిటీ ట్రస్టుకు ఉచితంగా లీజుకు కేటాయింపునకు ఆమోదం.