రాధాకృష్ణ మస్తిష్కానికి సుస్తీ! 

ABN Radhakrishna is criticizing Prime Minister Modi
ఎప్పుడూ జగన్, కేసీఆర్ లను మాత్రమే విమర్శిస్తుంటే బాగుండదనుకున్నాడేమో, మన క్షుద్రజ్యోతి బాధాకృష్ణ ఈసారి ప్రధాని మోడీ ప్రస్తావన కూడా తెచ్చాడు.  ఆయన పట్ల కూడా చిరు విమర్శ చేశాడు.  కానీ, ఎలా ఉందంటే, నెమలి ఈకతో నిమిరినట్లు….అదే జగన్ విషయానికి వస్తే గడ్డపారతో పొడిచినట్లు ఉంటుంది.  కేసీఆర్ విషయానికి వస్తే డాక్టర్ ఇంజెక్షన్ చేసేటపుడు ఒక అరక్షణం చురుక్కుమన్నట్లు ఉంటుంది.  ఎన్ని జాకీలేసి లేపినా తన యజమాని చంద్రబాబు, కాబోయే యజమాని లోకేష్ నాయుడు…ఇద్దరూ మోడువారిన తరువుల్లా, పాడె మీద నిద్రిస్తున్న శవాల్లా కదలికలు లేకుండా పడిఉన్నారు.  కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్లడమే అపరాధం అన్నట్లు,వారు ఢిల్లీ వెళ్ళగానే అక్కడ మోడీ కాళ్ళమీద పడిపోయినట్లు కలలు కంటూ తన కుతిని తీర్చుకుంటూ కుటిలనీతిని బయటపెట్టుకుంటున్నాడు.  “హస్తినతో దోస్తీ” అంటూ తన మస్తిష్కంలో సుడులు తిరుగుతున్న మలినాన్ని విసర్జించాడు…
 
ABN Radhakrishna is criticizing Prime Minister Modi
ABN Radhakrishna is criticizing Prime Minister Modi
“””కేంద్రంపై ఇక యుద్ధమే అని ప్రకటించిన వెంటనే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను కలుసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలకు ఆర్థిక సహాయం చేయాలని, కాళేశ్వరం మూడవ దశకు అనుమతివ్వాలని కేంద్ర పెద్దలను కేసీఆర్‌ కోరినట్టు లీకులిచ్చారు”””
 
అంటే కేంద్రంపై యుద్ధమే అంటే రాష్ట్రంలోని చతురంగ బలాలను వేసుకుని కాహళులు, భేరీలు మ్రోగించుకుంటూ హస్తినకు  వెళ్లి మోడీ ఇంటిముందు నిలుచుని తొడగొట్టాలన్న మాట!  ఏ ముఖ్యమంత్రి రాజకీయంగా ఎంత విమర్శించినా, దేశాధినేతలు ప్రధానమంత్రి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు.  కేంద్రం ఇచ్చే నిధులు అన్నీ మోడీ జేబులోనుంచి, అమిత్ షా పర్సు లోనుంచి ఇచ్చేవి కావు.  పన్నుల రూపంలో దేశ ప్రజలు చెల్లించేవి.  వాటిలో రాష్ట్రాల వాటా కూడా ఉంటుంది.  రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ కేంద్రపెద్దలను కలవడం ఎవరికైనా తప్పదు.  కేసీఆర్ కేంద్రపెద్దలను ఏమి కోరారో లీకులు ఇచ్చారని రాధాకృష్ణకు ఎవరు లీక్ ఇచ్చారో?  
 
“””ముఖ్యమంత్రి పదవి నుంచి తాను ఎప్పుడు తప్పుకొంటున్నదీ కేసీఆర్‌ స్పష్టత ఇవ్వలేదట. అయితే కేసీఆర్‌ మాటలను కేంద్ర పెద్దలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయన చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు”””
 
ఇక్కడ మళ్ళీ “ట” కారాలతో ఊహాగానాలు!  కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి పోతన ఉండదని వారు అభిప్రాయపడుతున్నారని మోడీ గారు రాధాకృష్ణకు లీక్ చేసి ఉంటారు! 
 
“””బీజేపీతో యుద్ధం చేస్తానని చెప్పిన వెంటనే మా నాయకుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుసుకోవడంతో మేం తలెత్తుకుని తిరగలేకపోతున్నామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసుల భయం కేసీఆర్‌కు పట్టుకుందని తెలంగాణలో చిన్న పిల్లగాడు కూడా మాట్లాడుతున్నాడని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.”””
 
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్రపెద్దలను కలిస్తే టీఆరెస్ ఎమ్మెల్యేలు తలెత్తుకుని తిరగలేకపోతున్నారా?  ప్రధానమంత్రిని కలవడానికి చంద్రబాబు అధికారంలో ఉండగా ముప్ఫయి సార్లు వెళ్లి అపాయింట్మెంట్ దొరక్క ముఖం వేలాడేసుకుని ఇంటికొచ్చాడు.  కేసీఆర్, జగన్ వెళ్ళగానే అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి.  ప్రధానమంత్రికి  చంద్రబాబు ఒక ట్వీట్ చెయ్యగానే ఆయన భజనమీడియా ఏదో ప్రపంచాన్ని జయించినంత బిల్డప్ ఇస్తున్నది.    ప్రధానమంత్రిని కలవడం తలవంపులు అని  రాధాకృష్ణ ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఒకరిద్దరి పేర్లు లీక్ ఇస్తే బాగుండేది బాధాకృష్ణా!    
 
“””రాష్ట్రంలో ప్రత్యర్థులపై విరుచుకుపడే జగన్‌రెడ్డి ఢిల్లీలో మాత్రం వినయవిధేయతలు ప్రదర్శించక తప్పని పరిస్థితుల్లో ఉన్నారన్నది వాస్తవం.””””
 
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్ధులు, కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఒకరేనా రాధాకృష్ణా!  ఓరి నీ తెలివి తెల్లారిపోనూ!  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీకి వ్యతిరేకంగా అనేక  విమర్శలు చేశారు.  కేసులు ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు.  మరి ఇప్పుడు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబును ధైర్యం చేసి మోడీని ఒక్క మాట అనిపించండి చూద్దాం!   చంద్రబాబు ధిక్కారధోరణి ఎంత గొప్పదో ఈ రాష్ట్రప్రజలు చూస్తారు!!
 
“””అయినా కేసీఆర్‌ భయపడుతున్నట్టుగా ఆయన భయపడటం లేదు. తన కేసుల విషయంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉండడమే ఇందుకు కారణం.””””
 
పై వాక్యంలో మోడీ దగ్గర వినయవిధేయతలు ప్రదర్శిస్తున్నారు అంటూ కిచకిచలాడిన రాధాకృష్ణ తరువాతి వాక్యానికి వచ్చేసరికి జగన్ భయపడటం లేదని, కేసుల విషయంలో ఏమి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని సూత్రీకరిస్తున్నాడు.  మరి ఆ సంగతి తెలిసీ కూడా వినయవిధేయతలు ప్రదర్శిస్తున్నాడని వంకరకూతలు, వక్రభాష్యాలు దేనికి?  
 
“””మోదీ వంటి బలమైన నాయకుడు కూడా రైతులకు శిరస్సు వంచి, చేతులు జోడిస్తున్నా అంటున్నారు గానీ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మనసు కరగడం లేదు.””” 
 
రాధాకృష్ణకు మతిభ్రమణం తారాస్థాయిలో ఉన్నదనడానికి  ఈ ఒక్క వాక్యం చాలని నా అభిప్రాయం.   దేశం మొత్తానికి వర్తించే వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని రద్దు చెయ్యమని రెండు రాష్ట్రాలకు చెందిన లక్షలమంది రైతులు ఢిల్లీ వీధుల్లో చలిని కూడా లెక్కచేయక, రోడ్ల మీద నిద్రిస్తూ, రోడ్లమీదనే వంటలు చేస్తుకుంటూ చేస్తున్న ఆ ఆందోళన ఎక్కడ…హాయిగా కడుపునిండా తిని, ఖరీదైన కార్లలో ఏదో పెళ్ళికి వచ్చినట్లు వచ్చి కుర్చీల్లో కూర్చుని ఎండ వేడిమి తగలకుండా టెంట్లు వేసుకుని కాసేపు అరిచి సాయంకాలం ఇంటికి వెళ్లిపోయే అమరావతి పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడ?   ఏడాది నుంచి డ్రామాలు ఆడుతున్నా, ఈరోజు వరకు పట్టుమని వెయ్యిమంది రైతులను ఆ టెంట్ల నీడన చూడలేదు ఎవరూ.  అమరావతి డ్రామాలు చంద్రబాబు, ఆయన ముఠాలోని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేసే కృత్రిమ ఉద్యమాలని అందరికీ తెలుసు.  దానికి దీనికి పోలికా?  నవ్వుతారన్న సిగ్గు కూడా లేదు!  
 
“””మూడు రాజధానులు కావాలంటూ కిరాయి మూకతో ఉద్యమం చేయించడమే కాకుండా న్యాయమూర్తులను సైతం రెచ్చగొట్టేలా వారు కోర్టుకు వెళ్లే సమయంలో ప్లకార్డులు ప్రదర్శింపజేస్తున్నారు.”””
 
మూడు రాజధానులు కావాలని ఉద్యమం చేసే వారు కిరాయి మూక!!   ఒకే రాజధాని కావాలని ఓండ్రపెట్టేవారంతా పాపం ముత్యాల చెమ్మచెక్కలు!   అస్మదీయులకు ఒక న్యాయం…తస్మదీయులకు ఒక న్యాయం.  ఈ ధోరణి వల్లనే  చంద్రబాబు సర్వనాశనం అయిపోయాడు!  తెలుసుకోకపోతే మరింత పతనం తప్పదు.  
 
“””ఈ క్రమంలో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వంటివారు భావోద్వేగానికి గురవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పరిధి దాటి చేసినవిగా అనిపించవచ్చు.”””
 
ఒహోహోహో…ఏ బోధివృక్షం క్రింద కూర్చుంటే అయిందో ఇంత గొప్ప జ్ఞానోదయం!  నిన్నగాక మొన్ననే జస్టిస్ రాకేష్ కుమార్ ను ఆకాశానికెత్తుతూ ఆయన రాష్ట్ర భవిష్యత్తు పట్ల తెగ ఆందోళన చెందుతున్నాడని పిచ్చి కూతలు కూసిన రాధాకృష్ణ ఇప్పుడు రాకేష్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారని, ఆ వ్యాఖ్యలు పరిధి దాటి చేసినవని రాకేష్ కుమార్ కు సుప్రీమ్ కోర్ట్ మాడు పగిలేట్లు మొట్టికాయలు వేసిన తరువాత కానీ అర్ధం కాలేదన్నమాట!  భావోద్వేగాలకు గురయ్యేవారు ఆ ఉద్వేగంతో తప్పుడు తీర్పులు ఇవ్వరని నమ్మకం ఏముంది?  రాధాకృష్ణ అభిప్రాయం నిజమే అయితే జస్టిస్ రాకేష్ కుమార్ అసలు న్యాయపీఠం మీద కూర్చోవడానికే  అనర్హులు!
 
“”జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నిర్ణయం ఆందోళన కలిగించేదిగా ఉందనీ, ఇలాంటి ఉత్తర్వులను గతంలో తాము చూడలేదనీ, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందన్న అభిప్రాయానికి జడ్జి రావడానికి ప్రభావితం చేసిన అంశాలేమిటో తెలియాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. “””
 
సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికన్నా మనకు చట్టాలు, న్యాయసూత్రాలు , రాజ్యాంగం తెలుస్తుందా?  న్యాయవృత్తిలో పండిపోయి మరొక నాలుగు నెలల్లో రిటైర్ కాబోతున్న ఈ దేశ ప్రధాన న్యాయమూర్తే జస్టిస్ రాకేష్ కుమార్ నిర్ణయం ఆందోళన కలిగించేలా ఉన్నదని వ్యాఖ్యానించారంటే అసలు జస్టిస్ రాకేష్ కుమార్ గత ఏడాదిలో చేసిన విచారణలు, ఇచ్చిన తీర్పులను మొత్తం పునస్సమీక్షించాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలియడం లేదూ? 
 
“”””బిహార్‌కు చెందిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ది దూకుడు మనస్తత్వం అని చెబుతుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఆయన.. కొన్ని సందర్భాలలో పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన మాట కూడా వాస్తవమే. రాష్ట్రప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు కూడా కోర్టులోనే ఆయనతో వాదనకు దిగుతూ రెచ్చగొడుతూ వచ్చారు.”””
 
అరెరెరె…. ఎంత దారుణం…ఎంత దారుణం!  అదేమిటయ్యా బాబు! నిన్నటిదాకా రాకేష్ కుమార్ కు  చంద్రబాబుకు చేసిన భజన కన్నా ఉధృతంగా భజన చేసిన రాధాకృష్ణకు హఠాత్తుగా రాకేష్ కుమార్ లోని అన్ని అవలక్షణాలే   కనిపిస్తున్నాయి!  ఆయనకు భావోద్వేగాలే కాక మనస్తత్వం కూడా దూకుడుదే అని గ్రహింపు కలిగిందా?  గత అయిదారు నెలలుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న తీర్పులు చూసి ఆయన అసలు ఆ పదవికి పనికిరాడు అని సామాన్యప్రజలకు కూడా  తెలిసిందే!  మరి నీకు ఇంత ఆలస్యంగా బుర్రలో లైట్ వెలిగిందేమిటి చెప్మా??!!
 
  “”” హైకోర్టులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్‌ కోర్టులు కావు. కనుక హైకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రప్రతిపత్తి కలిగి ఉంటారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు అన్ని తీర్పులు ఇవ్వడానికి కారణం ఏమిటి? న్యాయమూర్తులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందుకు దోహదపడుతున్నాయా? మొదలైన అంశాలు తెలియాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా తెలుసుకోవడం వాంఛనీయంగా కనిపిస్తున్నది.””””
 
ఎస్…భలే కరెక్ట్ గా చెప్పారు రాధాకృష్ణ.  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినతరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన అన్ని తీర్పులు, వ్యాఖ్యలను పరిశీలించడానికి, సమీక్ష చెయ్యడానికి అత్యున్నత న్యాయమూర్తుల…ఆంధ్రప్రదేశ్ కు చెందని వారితో ఒక కమీటీ వెయ్యాల్సిందే.  
 
మొన్నటిదాకా జగన్ కు  హైకోర్టు మొట్టికాయలు, జగన్ కు ఎదురుదెబ్బలు, జగన్ కు షాకిచ్చిన హైకోర్టు అంటూ పైశాచిక ఆనందం పొందుతూ తాటికాయంత అక్షరాల్లో వార్తలు వండి వడ్డించిన ఎల్లో మీడియా ఇప్పుడు ఆ హైకోర్టుకే సుప్రీమ్ కోర్ట్ నుంచి వరుస షాకులు తగులుతుండటాన్ని ఏమాత్రం జీరించుకోలేకపోతున్నది అనేది పరమ సత్యం.  ఏనాటికైనా అధర్మానికి ఓటమి తప్పదని, సత్యమే జయిస్తుందని చంద్రబాబు క్షుద్రమీడియాకు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు