విజయదశమి.. విజయాలకు వేదికగా నిలిచిన, నిలిచే పండుగా దీనికి పేరు. అమ్మవారి అనుగ్రహంతో దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిగిన రోజు ఇది. రామాయణంలో రావణసంహారం, భారతంలో అర్జునుడు అజ్ఞాతవాసం వీడి ఆయుధాలను తీసుకున్నరోజు ఇలా అనేక ఘటనలకు.. విజయాలకు నెలవు ఈ పండుగ. అయితే ఈ పండుగ నాడు విజయ ముహూర్తం చాలా ముఖ్యమైనది. ఆ సమయం విశేషాలు తెలుసుకుందాం…
విజయదశమి.. అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు అపరాన్నకాలంలో ఉండే మూహుర్తం ఆధారంగానే దసరా పండుగను నిర్ణయిస్తారు. ఈసారి అక్టోబర్ 25 లేక 26 అనేది చాలామందికి సంశయం.కానీ అపరాన్నసమయంలో వచ్చే విజయ మూహుర్తం అక్టోబర్ 25న వచ్చింది. కాబట్టి 25వ తేదీనే దసరా చేసుకోవాలి. ఈపాకి విజయ ముహూర్త సమయం మధ్యాహ్నం 1.57 నిమిషాల నుంచి 2.42 నిమిషాల వరకు సుమారు 44 నిమిషాల వ్యవధిలో ఉంది. అదేవిధంగా
అపరాజిత పూజను మధ్యాహ్నం 1.12 నుంచి 3.27 వరకు నిర్వహించాలి. మొత్తం కాలం 2 గంటల 15 నిమిషాలు. ఆయా ప్రాంతాల వారు అక్కడి సమయాలను అనుగుణంగా పైన చెప్పిన ముహూర్తాలలో ఏ పనినైనా ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారని శాస్త్రవచనం, పలువురికి అనుభవైక మంత్రం. ఈ రోజు ఏ పనినైనా ప్రారంభించడానికి ముహూర్తం చూడనక్కర్లేదు. మంచి పనిని ఈ రోజు ప్రారంభించి అమ్మమీద భారం వేసి నిజాయతీతో శ్రమిస్తే తప్పక విజయం సొంతం అవుతుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. సకల కార్యసిద్ధికి మూలం. కాబట్టి ఆ ఆదిపరాశక్తిని విజయ మూహుర్తంలో,అపరాజిత పూజా సమయంలో ఆరాధించి పనిని మొదలుపెట్టాలి. దీనివల్ల దైవకృప శ్రీఘ్రంగా లభించి తలచిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది.