సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది. కానీ దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం. మరొక విధంగా చెప్పాలంటే అమావాస్య నుండి అమావాస్య వరకుగల సమయంలోపల, సూర్యుడు రెండు రాశులు దాటుతాడు. ఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి సంభవిస్తుంటుంది.
వెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ జరుగుతుంది. దీనిని క్షయ మాసం అని పిలుస్తారు.
1823 లో వచ్చిన స్వభాను నామ సంవత్సరం తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 లో వచ్చిన క్రోధి నామ సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964 తరువాత మళ్ళీ కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 లో రుధిరోద్గారి నామ సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించింది. ఇక మనెవ్వరి జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము. ఎందుకంటే తరువాయి క్షయ మాసం సంభవించబోయేది 141 ఏళ్ళ తరువాత 2124 లోని తారణ నామ సంవత్సరంలోనే.