2023 లో సంక్రాంతి పండుగ జరుపుకునే తేదీ, పూజా విధానం గురించి పూర్తి వివరాలు..!

తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజులు పాటు జరుపుకొనే ఈ పండుగ కి చాలా ప్రత్యేకత ఉంది. మొదటి రోజు భోగి,రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవరోజు కనుమ పండుగ జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది బకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలో తెలియక ప్రజలు సందిగ్ధం లో ఉన్నారు. ఈ ఏడాది మకర సంక్రాంతి ఏ తేదీలలో జరుపుకోవాలి? మకర సంక్రాంతి పూజా విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం 2023వ సంవత్సరంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 14వ తేదీ రాత్రి 08.20 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ధనుస్సు రాశిలో తన ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. అందువల్ల జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సరైన రోజని పండితులు చెబుతున్నారు. 2023 జనవరి 15వ తేదీ ఉదయం 06.48 గంటల నుండి సాయంత్రం 05.41 గంటల వరకు శుభ సమయం ఉంటుంది. అందువల్ల జనవరి 15వ తేదీ ఉదయం 06.48 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి.

మకర సంక్రాంతి పూజా విధానం :

హిందూ పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనం రాక్షసుల రోజు అయితే ఉత్తరాయణం దేవతల రోజు. ఈరోజున దేవతలందరూ భూమిపైకి వస్తారని నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే గంగానదిలో స్నానం చేసి.. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత సూర్యభగవానుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తూ ఆయన్ని పూజించాలి. మకర సంక్రాంతి రోజున దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ రోజున నిరుపేదలకు ధాన్యం, నువ్వులు బెల్లం వంటి వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర సంక్రాంతి రోజున ఇంటికి వచ్చిన కొత్త ధాన్యాలను ఉపయోగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి.