మాధవి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన యశోద డాక్టర్లు

ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి హెల్త్ బులెటిన్ ను సోమాజీగూడలోని యశోద హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. నలుగురు డాక్టర్ల బృందం మాధవికి వైద్యం అందిస్తున్నామన్నారు.  ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.  ప్రస్తుతం వెంటిలేషన్ పై మాధవికి చికిత్స కొనసాగుతుందన్నారు. మరో 48 గంటలు గడుస్తే కానీ మాధవి పరిస్థితి చెప్పలేం అని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే.

8 గంటల పాటు శ్రమించి రక్తస్రావం తగ్గించామని, మాధవికి తీవ్ర రక్త స్రావం కావడంతో 6 బాటిళ్లతో రక్తం ఎక్కించామన్నారు. ఎడమ చేయి పూర్తిగా దెబ్బతిందని కేవలం చర్మం మాత్రమే మిగిలి ఉందన్నారు. మెడ పై ఉన్న గాయాలను తగ్గించే ప్రయత్నం చేశామని ఆమె మెడకు వెళ్లే నరాలు సెట్ చేశామని తెలిపారు. మెడ పై ముఖ కవలికలకు సంబంధించిన 3 నరాలు తెగిపోయాయని చేతితో పాటు అన్ని నరాలను సెట్ చేశామన్నారు.

మాధవికి నిన్న రాత్రి అంతా దాదాపు 10 గంటల పాటు ఈ సర్జరీలు చేశామన్నారు. ఇంకా రెండు మూడు సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందని ముందుగా ఆమెను బతికించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆమె పరిస్థితి అనుకూలంగా ఉంటే అప్పుడు మిగిలిన చికిత్సలు చేస్తామని డాక్టర్ల బృందం తెలిపింది. శాయశక్తులా మాధవిని ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నామని 48 గంటలు గడిస్తే కానీ ఆమె ప్రాణానికి గ్యారంటి ఇవ్వలేమని తెలిపారు.

బోరబండ వినాయక నగర్ కు చెందిన మాధవి విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన సందీప్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వాడు. వీరిద్దరికి ఐదేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. సందీప్ కూకట్ పల్లిలో బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. మాధవి హిందూ కాలేజిలో చదువుతుంది. మాధవి తండ్రి గోల్డ్ స్మిత్ గా పని చేస్తున్నాడు. మాధవి సందీప్ లు తమ ప్రేమ విషయాన్ని తండ్రి మనోహారా చారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి మనోహరా చారి ఒప్పుకోలేదు.

దీంతో ఇద్దరూ పది రోజుల క్రితం ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. మనోహరా చారి నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అందరిని పంపించారు. దీనికి ఏ మాత్రం ఒప్పుకోని మనోహరా చారి వారితో బాగున్నట్టుగా నటించి బట్టలు పెట్టాలి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ కు రండి కొనిస్తానని నమ్మించి వారిని రప్పించాడు. రాగానే ఆయన అనుకున్నట్టుగా వారిపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. మనోహరా చారి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.