చిరంజీవి సినీ చరిత్రలో ‘ఖైదీ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్ ఫార్మెట్ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్ సినిమా లెక్క మొత్తం మారిపోయింది. టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది.
చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఖైదీ’ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు.
బెయిల్ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు. ఖైదీ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ’ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేను.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డిగారిని నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌ని, నా కోస్టార్స్ సుమలత, మాధవి మొత్తం టీమ్‌ను అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.