ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు,పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వాహనాలు నడిపేవారు నిర్లక్ష్యం జాగ్రత్త కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది కుటుంబ పెద్దలను కోల్పోయి అనాధలుగా మిగులుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో కూడా ఇటువంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవుడి దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం వల్ల అనంత లోకాలకు వెళ్లిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…వరంగల్ జిల్లాకేంద్రంలోని కాశీబుగ్గకు చెందిన మామిడాల సురేందర్ , మాధవి దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు అమెరికాలో, కొడుకు కెనడాలో ఉండగా, చిన్న కుమార్తె మేఘనను కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మరో రెండురోజుల్లో మేఘన అమెరికాకి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ లోపు వేములవాడ రాజన్న దర్శించుకోవాలని తల్లిదండ్రులు అనుకున్నారు. ఈ క్రమంలో సురేందర్, మాధవి దంపతులతో పాటు కూతురు మేఘన, అక్క కొడుకు కూచన్ అశోక్ నలుగురు కలిసి శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరారు.
ఈ క్రమంలో వీరి కారు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి శివారులోని జాలగుట్ట వద్ద కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా ఉత్తరాఖండ్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ఈ క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా కారు నడుపుతున్న సురేందర్ కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంలో కారులో ఇరుక్కుపోయిన మాధవి, మేఘన, అశోక్ లను గ్యాస్ కట్టర్ల సహాయంతో కారు నుండి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సురేందర్ మరణించగా మిగిలిన ముగ్గురిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.