లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్ కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ ఆదివారం ఉదయం నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం సంజయ్ హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా దానిని తోసి పుచ్చింది న్యాయస్థానం. దీంతో హై కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని నిజామాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా పరారీలో ఉన్న డీఎస్ సంజయ్ పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై నిర్భయ కేసుతోపాటు ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
శాంకరీ నర్సింగ్ హోమ్ కళాశాల విద్యార్థినులపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి పరారీలో ఉన్న సంజయ్ 41/A సెక్షన్ కింద పోలీసులు నోటీసులు జారీ చేయడంతో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు ఆయనను ఇంటరాగేట్ చేస్తున్నారు. విచారణలో వెలువడిన వివరాలు సాయంత్రంలోగా తెలిసే అవకాశమున్నట్టు సమాచారం.