తెలంగాణలో మరికొన్ని నెలల్లో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించడం అన్ని పార్టీలకు కీలకం కాగా ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ నుంచి నేతలను లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా బీజేపీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.
చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డిని దారికి తెచ్చుకోవాలని భావించిన టీఆర్‌ఎస్ పాత కేసులను తెరపైకి తీసుకొనిరాగా ఆయన బీజేపీలో చేరి అధికార పార్టీకి షాకిచ్చారు. పలు భూవివాదాల కేసులలో గతంలో తాడూరి వెంకట్‌రెడ్డి పేరు వినిపించింది. అయితే ఆయన అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు గతంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
గత కొన్ని రోజుల నుంచి తాడూరి వెంకట్‌రెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరగగా ఇదే సమయంలో తుఫ్రాన్ పేట గ్రామ రైతులు ఆయన అక్రమంగా భూములు పట్టా చేయించుకున్నారని ధర్నా చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సివిల్ డ్రెస్ లో ఆయన ఇంటికి వెళ్లగా పలువురు బీజేపీ నేతలు అడ్డుపడ్డారు. ఆ తర్వాత తాడూరి వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరారు. మరోవైపు ఈటల రాజేందర్ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించడం కోసం అన్ని రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఖరీదైన ఎన్నికలలో ఈ ఎన్నిక కూడా ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మునుగోడులో ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ సభ జరగనుండగా 21వ తేదీన అమిత్ షా సభ జరగనుంది.