అతనికి పెళ్లయ్యి పిల్లలు ఉన్నారు. అయినా కూడా 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకొమ్మని యువతి బలవంతం చేస్తే చేసుకుంటానని నమ్మించి నల్లగొండకు తీసుకెళ్లాడు. పోతుంటే మార్గమధ్యలోనే గొంతు నులిమి చంపి బస్తాల కుక్కి గుట్టల పడేశాడు. ఈ దారుణమైన సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పొల్ గ్రామానికి చెందిన చింతల నరేందర్ రెడ్డి హైదరాబాద్ లోని దుండిగల్ లోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. నరేందర్ రెడ్డికి వివాహమైంది. భార్యతో కలిసి దుండిగల్ సమీపంలోలని మోరంపేట వద్ద నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మమతతో నరేందర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. తనకు వివాహం కాలేదని మమతను నరేందర్ రెడ్డి నమ్మించాడు.
నిజంగానే పెళ్లి కాలేదనుకొని మమత అతనితో ప్రేమ కొనసాగించింది. ఎలాగు పెళ్లి చేసుకునే వాళ్లమే కదా అని ఆమెను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. శారీరకంగా మమతను నరేందర్ రెడ్డి అనుభవించాడు. తనను పెళ్లి చేసుకోవాలని మమత గత కొంత కాలంగా నరేందర్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తోంది. దీంతో పెళ్లి చేసుకుంటానని తమ కుటుంబానికి చెప్పిన తర్వాత అక్కడే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.
ఈ నెల 20 న మమతను ఎల్ బీనగర్ రింగ్ రోడ్డు దగ్గర ఉండమన్నాడు. మేడ్చల్ నుంచి బైక్ పై నరేందర్ రెడ్డి ఎల్ బీనగర్ వచ్చాడు. సాయంత్రం బైక్ పై మమతను ఎక్కించుకొని కొప్పోల్ తీసుకుపోతున్నానని చెప్పాడు. మమత కూడా నిజంగానే తనను పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది.
మర్రిగూడ మండలం చర్లగూడం సమీపంలోని సరంపేట గుట్టవద్ద బండి ఆపాడు. మమతను కిందకు దింపాడు. మమతతో మాట్లాడుతున్నట్టుగా నమ్మించాడు. ఆమె చున్నీ తీసుకొని ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఆమె కాపాడుకునే ప్రయత్నం చేసినా ఆమెకు అవకాశం ఇవ్వకుండా గొంతు నులిమి చంపేశాడు. ఓ బస్తాలో మమత శవాన్ని కుక్కి గుట్టల వద్ద పడేశాడు. ఏం తెలియనట్టే మళ్లీ హైదరాబాద్ కు చేరుకొని తన డ్యూటికి వెళుతున్నాడు.
తమ బిడ్డ కనపడడం లేదని మమత తల్లిదండ్రులు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కేసును క్రైం బ్యాచ్ కు అప్పగించారు. మమత ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు మమత ఫోన్ చివరి సారిగా సరంపేట గుట్టల వద్ద సిగ్నల్ చూపించింది. దీని పై నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీసులకు క్రైం బ్యాచ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు బస్తాలో కుళ్లిన స్థితిలో మమత మృతదేహం కనిపించింది.
విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు వారు చెప్పారు. మమత ఫోన్ కాల్ డేటా అంత పరిశోధించగా నరేందర్ రెడ్డితో మమత చివరి ఫోన్ కాల్ ఉంది. నరేందర్ రెడ్డిని చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నరేందర్ రెడ్డి మమతను తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు.
ఈ దారుణ ఘటన తెలుసుకొని మమత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మమత హత్యతో నల్లగొండలో ఒక్కసారిగా కలకలం రేగింది. మర్రిగూడ పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మంగళవారం ఘటన వెలుగులోకి వచ్చింది.