ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు డ్రగ్స్,మందు, సిగరెట్ వంటి చెడు వ్యసనాలకు బాగా అలవాటు పడుతున్నారు. ఇలా డ్రగ్స్ వాడకం పెరగటంతో వీటిని సరఫరా చేసే ముఠాలు కూడా విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నాయి. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ విచ్చలవిడిగా వాటిని వినియోగిస్తూన్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ వేదికగా భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే 21 కిలోల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ జాతీయుడితో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను పర్వేజ్ ఆలం, నసీమ్ బర్కాజీ, షమీ కుమార్, రజత్ గుప్తాగా గుర్తించినట్లు పోలీసులు తెలియజేశారు.
హెరాయిన్ సరఫరా గురించి పోలీసులకు సమాచారం అందటంతో మొదట నసీమ్ బర్కజే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని వద్ద మూడు కిలోల హెరాయిన్ లభించిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు అతనిని విచారించగా అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ లో భాగంగా అతను పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలియజేశాడు. ఈ విషయంలో తన స్నేహితుడైన ఆలం తనకు సహాయం చేస్తున్నాడని నసీమ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అంతేకాకుండా ఆలం వద్ద భారీ మొత్తంలో హెరాయిన్ ఉందని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఢిల్లీలోని భజన్పురా ప్రాంతంలో ఒక స్థలం పై దాడి చేయగా అక్కడ ఆలం వద్ద 7.4 కిలోల హెరాయిన్ తో పాటు రూ.1.25 లక్షల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆలం పోలీసులకి పట్టుబడటంతో మిగిలిన వారి గురించి కూడా అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో పోలీసులు షమీ కుమార్, రజత్ గుప్తాను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు గురించి మరింత దర్యాప్తు చేసిన పోలీసులకు డ్రగ్ రాకెట్ సిండికేట్ మూలాలు పంజాబ్‌లో ఉన్నట్టు తెలిసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డ్రగ్ సిండికేట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. ఇక షమీ కుమార్, రజత్ గుప్తాలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 11 కిలోల వరకు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం హెరాయిన్ విలువ 130 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.