కానిస్టేబుల్ భార్యపై మరో పోలీసు కన్ను… తర్వాత ఏమైందంటే?

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఒక కానిస్టేబుల్, మరొక కానిస్టేబుల్ భార్యపై కన్నేశాడు. సహోద్యోగి లేని సమయంలో ఆమెను బలాత్కారం చేయబోయాడు. భర్త రాకతో ఆ ఇల్లాలు అతని నుండి తప్పించుకోగలిగింది. పోలీసులు సదరు కీచక పోలీసును అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. పోలీస్ క్వార్టర్స్ లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కృష్ణా జిల్లా పోలీస్ క్వార్టర్స్ లో జరిగిన దారుణమిది. బాగవతు బాలాజీ నాయక్, ఎల్లయ్య కృష్ణా జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇరువురూ పోలీస్ క్వార్టర్స్ లోని యు బ్లాక్ లో ఎదురెదురు ఇళ్లలో నివాసముంటున్నారు. కాగా బాలాజీ నాయక్ భార్యపై ఎల్లయ్య చూపు పడింది. ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలి అనుకున్నాడు. గురువారం బాలాజీ విధులకు వెళ్ళగానే అతని ఇంట్లోకి చొరబడ్డాడు ఎల్లయ్య. ఆమెను కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యాచారం చేయబోయాడు.

ఇంతలో ఏదో పని ఉండి ఇంటికి తిరిగి వచ్చిన బాలాజీ నాయక్ అదంతా చూసి షాక్ అయ్యాడు. ఎల్లయ్యను పట్టుకోబోగా అతను అక్కడ నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలాజీ నాయక్ భార్య చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎల్లయ్యను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్ కు తరలించారు.

ఒక కానిస్టేబుల్ భార్యపై మరొక ఖాఖీ కన్నేశాడు…కట్ చేస్తే కటకటాల వెనక్కి వెళ్ళాడు. నేరస్థులచే ఊచలు లెక్క పెట్టించాల్సిన పోలీసులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటంపై ప్రజలు మండి పడుతున్నారు. పోలీసుల భార్యకే రక్షణ లేకపోతే, అది కూడా పోలీసులనుండే లేకపోతే మాలాంటి వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్థానిక మహిళలు.