గుంతలు పూడ్చినా కేసే.. జగన్ కు తెలియకుండా ఈ తప్పులు జరుగుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల కాకపోయినా కొన్నిచోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో నిధులను విడుదల చేసి పనులను పూర్తి చేయించింది. మరికొన్ని ప్రాంతాలలో మాత్రం ఇందుకు సంబంధించిన పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఘటన వల్ల జగన్ సర్కార్ పై విమర్శలు వస్తున్నాయి.

కృష్ణా జిల్లాలోని తాడినాడ – చినతాడినాడ ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా నవరాత్రి ఉత్సవాల నిర్వాహకుడు, టీడీపీ నేత నంబూరి వెంకట రామరాజు మూడు కిలోమీటర్ల రోడ్డును మరమ్మత్తులు చేయించారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి పని చేస్తే అభినందిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం విచిత్రంగా రోడ్డు మరమ్మత్తు పనులు చేసిన వెంకట రామరాజుపై కేసు నమోదైంది.

రామరాజు చేసిన పని కొంతమంది నేతలకు నచ్చకపోవడంతో రోడ్డు మరమ్మత్తులను స్వచ్చందంగా చెయ్యడానికి అనుమతులు తీసుకోలేదని ఆర్ అండ్ బీ అధికారులతో ఫిర్యాదు చేయించారు. పోలీసులు రామరాజుకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు చేయడం లేదని ఈ విధంగా చేసేవాళ్లను కూడా ఇబ్బందులు పెడుతోందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు, అధికారులు ఈ విధంగా చేయడం జగన్ కు తెలిసి జరుగుతోందా? లేక జగన్ కు తెలియకుండా జరుగుతోందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ప్రతి చిన్న విషయానికి ఇతర పార్టీల నేతలను వైసీపీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలకు వైసీపీ మద్దతు ఇవ్వకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి.