పెళ్లి అయిన తెల్లారి పెళ్లి పిల్ల చనిపోయింది

వేద మంత్రాల మధ్య వారి పెళ్లి ఘనంగా జరిగింది. వారి పెళ్లితో అంతా ఆనందంగా గడిపారు. పెళ్లి తంతు ముగియగానే అత్తారింటికి వెళ్లిన వధువు తెల్లారే చనిపోయింది. అసలు ఏం జరిగిందంటే..

తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా పులికుత్తి గ్రామానికి చెందిన పాండియన్ కూతురు రమ్య. ఆమెకు  సరత్తు పట్టికి చెందిన రంగరాజ్ తో ఆదివారం వివాహం జరిపించారు. పెళ్లి జరగగానే దంపతులు సోమవారం జరిగే మరవలి వేడుకకు పులికుత్తికి వచ్చారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. 

రమ్య దంపతులతో పాటు వారి వెంట చిన్నాన్న వరుస అయ్యే ముత్తుకృష్ణన్ కూడా వెళ్లారు. బంధువుల ఇంట్లో భోజనానికి ఏర్పాట్లు చేస్తుండగానే రమ్య, ముత్తుకృష్ణన్ స్పృహ తప్పి కిందపడిపోయారు. వీరిని గమనించిన బంధువులు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కూడా విషం తాగినట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమించిన రమ్య చికిత్స పొందుతూ చనిపోయింది. ముత్తు కృష్ణన్  పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మధురై ఆస్పత్రికి తరలించారు. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రమ్య వయస్సు 23 సంవత్సరాలు, ముత్తు కృష్ణ వయస్సు 27 సంవత్సరాలు. ముత్తు వరుసకు బాబాయి అయినా కూడా రమ్యకు ముత్తుకు చాలా దగ్గరి స్నేహం ఉండేదని తెలుస్తోంది. వారిద్దరు ఎప్పుడు కలిసే ఉండేవారని వారిద్దరు ప్రేమించుకున్నట్టు బంధువులు అనుమానిస్తున్నారు. వరుసలు కలవకపోవడంతో వారి పెళ్లి కాదని నిర్ణయించుకోని ఇద్దరు కూడా గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉంటున్నారని తెలుస్తోంది.

రమ్య, ముత్తు ఇద్దరు కూడా నిత్యం ఫోన్లలో మాట్లాడుకునేవారని, చాటింగ్ లు కూడా చేసుకునేవారని స్నేహితులు తెలిపారు. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారని వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వారన్నారు. అయితే ఈ వరసలు ఎక్కడివని అయినా తాము దూరపు బంధువులే కదా.. రక్త సంబంధం కాదు కదా తప్పేముందని వారు స్నేహితులతో చర్చించారట. కానీ అందుకు కుటుంబ సభ్యులు సమాజం ఒప్పుకోదని ఆందోళన చెందారని తెలిసింది.

ఈ లోగా రమ్య కుటుంబ సభ్యులు ఆమెకు సంబంధాలు చూడడంతో తప్పనిసరి పరిస్థితిలో రమ్య ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. అయినా కూడా ప్రేమను మర్చిపోలేక..  చేసుకున్న  భర్తతో కాపురం చేయలేక పెళ్లి జరిగిన తెల్లారే విషం తాగి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. రమ్య చనిపోగా ముత్తు పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తమకు తెలియదని బంధువులు తెలిపారు. పెళ్లి అయిన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.