Kamal Haasan: కన్నడ వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటూ!

Kamal haasan: ప్రముఖ సీనియర్ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ మూవీ ఈవెంట్ లో భాగంగా నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కన్నడ కూడా తమిళం నుంచే పుట్టింది అని అన్నారు. దీంతో కమల్ హాసన్ వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై మండిపడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తూ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్బంగా కమల్ హాసన్ మాట్లాడుతూ..

నేను ప్రేమతో అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు చెప్పారు. నేను చేసిన వ్యాఖ్యలలో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు ఒక అరుదైన రాష్ట్రం. ఇక్కడ ప్రతి ఒక్కరిని మిళితం చేసుకునే తత్వం ఉంటుంది. ఓ మేనన్ ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఓ రెడ్డి సీఎం అయ్యారు. మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగచారి మనవరాలు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదు. నాకు కూడా ఇది వర్తిస్తుంది.

దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. అయితే తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందనే కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ భాషకు ఉన్న చరిత్ర తమిళ నటుడికి తెలియదంటూ విమర్శలు గుప్పించారు. దాంతో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ పై స్పందించాల్సి వచ్చింది.