‘ఎన్టీఆర్‌’బయోపిక్ సెకండ్ పార్ట్ వాయిదా!

సినిమా నిర్మించటం ఒకెత్తు..దాన్ని థియోటర్స్ లోకి సరైన టైమ్ లో సజావుగా తీసుకెళ్లటం మరో ఎత్తు. అందుకే రిలీజ్ డేట్స్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూంటారు దర్శక,నిర్మాతలు. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్స్ ని సైతం సంప్రదిస్తారు. ఏ సమయంలో అయితే కలెక్షన్స్ బాగుంటాయో , పోటీ లేకుండా ఉంటుందో చూసుకుని అప్పుడు విడుదల చేస్తారు. మొదట ఓ విడుదల తేదీ అనుకున్నా..తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడిపై ఆ తేదిని మారుస్తూండటం కూడా జరుగుతూంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు అలాంటిదే జరగబోతోందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే… నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదల తేదీలతో ప్రకటనలు కూడా వచ్చాయి. రిలీజ్ డేట్ ను అందుకోవటానికి ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా తొలి భాగం యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రెండవ భాగం యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు జనవరి 24న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

అయితే రెండు సినిమా మధ్య గ్యాప్ తక్కువగా ఉండే కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్, నందమూరి ఫ్యాన్స్‌. దాంతో రెండవ భాగాన్ని పోస్ట్‌పోన్‌ చేయాల్సిందిగా చిత్రయూనిట్‌పై ఒత్తిడి తెస్తున్నారట. అయితే తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్‌ పరిగణలోకి తీసుకుందని సమాచారం.

ఈ రెండు పార్ట్‌లకు రెండు వారాలే గ్యాప్‌ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్‌ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటన అయితే ఇంకా రాలేదు.