పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే తమకు అత్యంత ఆదరణ దక్కుతుందని తెలుగుదేశం భావించిందో అక్కడే వారికి ఎదురుఎబ్బ తగిలింది. జగన్ సర్కార్ తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతం ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో తీర్పు చెబుతారని, వైసీపీని చిత్తుగా ఓడిస్తారని చంద్రబాబు కలలు కన్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఆశించినంతగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చిత్తు కాలేదు. మంగళగిరి ప్రాంతంలో ఉన్న 18 పంచాయతీల్లో 14 పంచాయతీలను వైసీపీ గెలిచుకుంది. అంతేకాదు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడ వైసీపీదే హవా కనిపిస్తోంది. ఎక్కడా ఆశించిన స్థాయి ఫలితాలు టీడీపీకి దక్కలేదు. దీంతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అసలు ఈ పంచాయతీ పోరులో రాజధాని ప్రాంతం ఇచ్చే తీర్పునే రెఫరెండం అని వాదిద్దామనుకున్న ప్రతిపక్షానికి తీవ్ర నిరాశ ఎదురైంది.
ఈ ఎన్నికల ఫలితాలు చూపించి అమరావతిలో రాజధాని మార్పు మీద ఎలాంటి వ్యతిరేకత లేదని, అక్కడి గ్రామాల్లోని జనం వైసీపీ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో అక్కడి జనం వైసీపీకి ఓట్లు వేసిన సంగతి నిజం, వైసీపీ మద్దతుదారులు గెలిచినా సంగతి నిజం. ఆ నిజానికి అమరావతి ప్రాంతంలో రాజధాని మార్పు మీద వ్యతిరేకత లేదనే కల్పనను ఆపాదించుకోవడం కరెక్ట్ కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే గెలిపించారో వాళ్ళే ఇప్పుడూ గెలిపించారు. ఆ గెలిపించిన వారిలోనే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నవారు ఉన్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేతలు ఉద్యమం చేస్తున్నది ఒక కులం వాళ్లేనని, టీడీపీ మద్దతుదారులేనని అంటూ వచ్చారు.
వాళ్ళన్నట్టు ఉద్యమంలో పాల్గొన్నది టీడీపీ కార్యకర్తలు మాత్రమే అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు మెజారిటీ సాధిస్తుంది. వాళ్లంతా టీడీపీనే గెలిపించేవారు కదా. కాబట్టి ఉద్యమంలో పాలుపంచుకుంటున్న వారిలో టీడీపీ మద్దతుదారుల కంటే సామాన్య జనం అందునా వైసీపీకి మద్దతుచ్చేవారే ఎక్కువ ఉన్నారని అనుకోవచ్చు. మరి గత ఏడాదిన్నరగా వాళ్లనే కదా వైసీపీ నేతలు, ప్రభుత్వం వేలెట్టు చూపుతున్నది, తప్పుబడుతున్నది. వారి కలలనే కదా రాజధానిని తరలించి కల్లలు చేయాలని అనుకున్నది. అయినా కూడ వారు తాము ప్రభుత్వ వెంటే ఉన్నామని, తమను సర్కార్ ఆదుకోవాలని ఓట్లు వేసి విన్నవించుకుంటున్నారు. మరి వైసీపీ నాయకులు ఇన్నాళ్లు ఇబ్బందిపడుతున్నది మనవాళ్లే అనే నిజాన్ని ఇప్పటికైనా గ్రహిస్తారో లేదో చూడాలి.